వైరా, మే 16 (పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి)
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు శనివారం పరిశీలించారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరు రమేష్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, సీనియర్ నాయకులు మండదపు సుబ్బారావు తదితరులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. నెల రోజులుగా రైతులు కల్లాల్లో ధాన్యం నిల్వ ఉంచి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ రైతులు నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
“40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నాయకులు రైతులు 40 రోజులుగా ఇబ్బందులు పడుతుంటే ఎందుకు స్పందించడం లేదు? పెద్ద పెద్ద పైలాన్లు కట్టుకోవడం కంటే రైతుల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి” అని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో అధికారులను ప్రశ్నించగా లారీలు అందుబాటులో లేవని సమాధానం చెప్పడం దారుణమన్నారు. రైతుల పంటను తరలించేందుకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
అలాగే వరి, మొక్కజొన్న కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మిల్లర్లు “తరుగు” పేరుతో క్వింటాకు 7.5 కిలోల వరకు తగ్గిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడంతో పాటు తరుగు దోపిడీని అరికట్టాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


