రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి/ పున్నమి ప్రతినిధి
బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని బీసీ సాధికారిక సంఘం స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ కోరారు. బీసీ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో కనీసం రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించి, చట్టబద్ధంగా బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని ఆయన అన్నారు.
అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించినట్లుగా ప్రతి సంవత్సరం బీసీ సంక్షేమానికి రూ.20,000 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.1 లక్ష కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా, విద్యార్థుల ఫీజులు–స్కాలర్షిప్ బకాయిల చెల్లింపులతో పాటు బీసీ కార్పొరేషన్‌కు తగిన నిధులు ఇవ్వాలని కోరారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో భాగంగా బీసీ కులగణన కూడా చేపట్టాలని, కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరగాలని సూచించారు. బీసీలపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ముందు ఆయన డిమాండ్ చేశారు.


