తాళ్లపూడి, తూర్పుగోదావరి (పున్నమి ప్రతినిధి): ఫిబ్రవరి 02: కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయని టిడిపి మండల మాజీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా తాళ్లపూడి యువ ప్రెస్ టీమ్‌తో మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు ఎనర్జీఎస్ పథకం ద్వారా గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని అన్నారు. గతంలో రూ.31 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్సీ ప్రాంతంలో రెండు రోడ్లు, ఓసీ ప్రాంతంలో నాలుగు రోడ్లను రూ.26 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామని, ఈ పనులు వారం రోజుల్లో పూర్తవుతాయని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఆయన అన్నారు. ఇప్పటివరకు గ్రామంలో 90 శాతం రోడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 10 శాతం రోడ్లకు రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా త్వరలో నిర్మించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ కొమ్ములపల్లి వెంకటమూర్తి, వేగేశ్వరపురం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు అంబటి కృష్ణ, బీజేపీ తాళ్లపూడి మండల అధ్యక్షులు యిండుగుల రామకృష్ణ, వేగేశ్వరపురం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు దేవన సత్తిబాబు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెంకట్, వీఆర్వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అలాగే గ్రామంలో చేపట్టిన సిమెంట్ రోడ్ల నిర్మాణాల వివరాలను తెలిపారు. కండేల్లి పద్మ ఇంటి నుండి తామరపల్లి శ్రీను ఇంటి వరకు రూ.7.50 లక్షలతో, కావూరి నాగేశ్వరరావు ఇంటి నుండి అంకోలు శ్రీను ఇంటి వరకు రూ.2.50 లక్షలతో, కావూరి సునీత ఇంటి నుండి వేములూరి విక్టర్ వారి ఖాళీ స్థలం వరకు రూ.2.50 లక్షలతో, పళ్ళ సూర్యకుమారి ఇంటి నుండి పాదం శెట్టి రామారావు ఇంటి వరకు రూ.6.50 లక్షలతో, పోలిశెట్టి నాగేశ్వరరావు ఇంటి నుండి ఏపీఎస్ఐడిసి కాలువ వరకు రూ.4 లక్షలతో, వీరస్వామి గద్దె నుండి తైలం ప్రసాద్ స్థలం వరకు రూ.3 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా తెలిపారు.



