ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం రాజకీయాల్లో బీ.ఆర్.ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వానికి జై కొడుతూ బీ.ఆర్.ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో వీరు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు.
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో 12వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ళ లక్ష్మీ, 25వ డివిజన్ కార్పొరేటర్ గోళ్ల చంద్రకళ, 32వ డివిజన్ కార్పొరేటర్ డోనవన్ సరస్వతి, 40వ డివిజన్ కార్పొరేటర్ దాదే అమృతమ్మ, 55వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి ఉన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ, ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా పేరుగాంచిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమర్థవంతమైన నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనతో ఖమ్మం నగరాన్ని ప్రగతి బాటలో నిలిపే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ చేరికలతో ఖమ్మం నగర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.



