నెల్లూరు, అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి)
నెల్లూరు మూలపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఈనెల 29న శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి స్వహస్తములతో శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
శుక్రవారం సాయంత్రం ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం, ఆలయ పునర్నిర్మాణ పనులు సుమారు ₹16.7 కోట్లతో చేపట్టనున్నట్లు చెప్పారు. ఆలయ ప్రణాళికలను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.
భూమి పూజ కార్యక్రమం అక్టోబర్ 29న ఉదయం 11.18 గంటలకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారని తెలిపారు.
ఆలయ పూర్వ వైభవం పునరుద్ధరించడమే లక్ష్యమని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీవెనలు పొందాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు.


