రక్తపోటును (High BP) ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. వైద్య రంగంలో రక్తపోటు (Hypertension)కి సంబంధించిన “50-50-50” సూత్రం అత్యంత ప్రాముఖ్యమైనది. దీనిని వైద్య పరిభాషలో ‘రూల్ ఆఫ్ హాల్వ్స్’ (Rule of Halves) అని పిలుస్తారు.
50 – 50 – 50 సూత్రం అంటే ఏమిటి?
రక్తపోటు ఉన్న మొత్తం జనాభాను మూడు భాగాలుగా విభజించి ఈ సూత్రాన్ని వివరిస్తారు.
మొదటి 50: సమాజంలో బిపి ఉన్న మొత్తం బాధితుల్లో 50% మందికి తమకు బిపి ఉందనే విషయమే తెలియదు. ఎందుకంటే బిపికి స్పష్టమైన లక్షణాలు ఉండవు. అందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు.
రెండో 50 : బిపి ఉందని తెలిసిన వారిలో సగం మంది (50%) మాత్రమే మందులు వాడతారు.
మూడో 50: బిపి మందులు వాడుతున్న వారిలో సగం మంది (50%) మాత్రమే బిపి మందులు క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే:
100 మంది బిపి రోగులు ఉంటే:వారిలో 50 మందికి మాత్రమే తమకు వ్యాధి ఉందని తెలుసుకుంటున్నారు.ఆ 50 మందిలో 25 మంది మాత్రమే మందులు వాడుతున్నారు.ఆ 25 మందిలో కేవలం 12 లేదా 13 మంది మాత్రమే బిపిని సరిగ్గా అదుపులో ఉంచుకోగలుగుతున్నారు.
పట్టణ ప్రాంతాల్లో బీపీ గురించి కొంత అవగాహన పెరిగినప్పటికీ.. మందులు సక్రమంగా వాడకపోవడం, బిపి పూర్తిగా అదుపులోకి రాకపోవడం అనేది పెద్ద సమస్యగానే ఉంది.
రక్తపోటు అనేది కేవలం వయసు మళ్లిన వారికి మాత్రమే వచ్చే జబ్బు కాదు. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి, ఆహారంలో ఉప్పు ఎక్కువ కావడం, వ్యాయామం లేకపోవడం మరియు సరైన నిద్ర లేకపోవడం వల్ల యువతలో కూడా బిపి విపరీతంగా పెరుగుతోంది.
30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఎలాంటి లక్షణాలు లేకపోయినా సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా బీపీ తనిఖీ చేయించుకోవాలి. బీపీ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు సక్రమంగా మందులు వాడాలి.


