ఏజెంట్ల సంక్షేమం.. హక్కుల పరిరక్షణే లియాఫీ లక్ష్యం
ఆత్మకూరు, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి): ఏజెంట్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అండగా నిలుస్తూ ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జీవిత బీమా సంస్థ ఆత్మకూరు( 65జే ) శాఖలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లియాఫీ ఆవిర్భావ దినోత్సవ కేక్‌ను కట్ చేసి ఏజెంట్లు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏజెంట్ల ఐక్యత, సంఘటిత శక్తిని చాటారు.
1964 అక్టోబర్ 2న బొంబాయిలో ఏర్పాటైన లియాఫీ దేశవ్యాప్తంగా జీవిత బీమా ఏజెంట్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన గౌరవం కోసం పనిచేస్తోందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై నిరంతరం ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఆత్మకూరు 65జే శాఖలో లియాఫీ స్థానిక విభాగాన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి శాఖ పరిధిలోని ఏజెంట్ల సమస్యలను పరిష్కరించేందుకు, వారి హక్కుల పరిరక్షణకు స్థానిక విభాగం కృషి చేస్తోందన్నారు. ఏజెంట్ల సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.జీవిత బీమా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఏజెంట్ల పాత్ర కీలకమని, ప్రజల్లో బీమాపై అవగాహన పెంచడంతో పాటు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రతి ఏజెంట్ బాధ్యతాయుతంగా పనిచేయాలని నాయకులు సూచించారు. ఏజెంట్ల ఐక్యతే సంఘానికి ప్రధాన బలమని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లియాఫీ ఆత్మకూరు శాఖ అధ్యక్షులు పడచల శ్రీనివాస యాదవ్, కార్యదర్శి మెంతెం శ్రీనివాసులు రెడ్డి, కోశాధికారి కోడూరు ఓబుల్ రెడ్డి, గౌరవాధ్యక్షులు షేక్ ఖాజావలి, వ్యవస్థాపక కార్యదర్శి కంచర్ల శ్రీహరి నాయుడు, ఆత్మకూరు శాఖ బీమా ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎస్. శ్యాం ప్రభాకర్, అధ్యక్షుడు టి. రమేష్, లియాఫీ సీనియర్ నాయకులు, జీవిత బీమా ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.



