Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

2026 వచ్చినా ఇంకా ఎందుకిలా ?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
2026 వచ్చినా ఇంకా ఎందుకిలా ?

వార్త ముఖ్యాంశాలు

  • - చెల్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై దృష్టి పెట్టరేం?
  • - ఉద్యోగుల ఓట్లు కూడా చెల్లకుండా పోతే ఎలా?
  • - ఈ సంఘటనకు జవాబు ఎక్కడ?

– చెల్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై దృష్టి పెట్టరేం?
– ఉద్యోగుల ఓట్లు కూడా చెల్లకుండా పోతే ఎలా?
– ఈ సంఘటనకు జవాబు ఎక్కడ?
ప్రజాస్వామ్యంలో ఓటు ఓ ఆయుధం లాంటిది. ప్రజాస్వామ్యానికి ఓటు ఆక్సిజన్. అలాంటి ఆక్సిజన్‌గా భావించబడే ఓట్లు కూడా చెల్లకుండా పోతున్నాయి. అయితే ఈ చెల్లని ఓట్లు ఏ చదువులేని వ్యక్తులవో, నిరక్షరాస్యులవో కావు. విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులైన, ఎన్నికలను జరిపే బాధ్యులైన ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా చెల్లకుండా పోవడం ఆలోచించాల్సిన విషయం.

ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, పరిషత్ ఎన్నికలను మనం పరిశీలిస్తే ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా అనేకం చెల్లకుండా పోయాయి. ఓటు వేసి కూడా వారు తగిన ప్రతిఫలాన్ని, విలువను సంపాదించలేకపోయారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం వారు ఎన్నికల విధులకు వెళ్లకముందే పోస్టల్ బ్యాలెట్ ఓటు అవకాశాన్ని కల్పిస్తుంది. సంబంధిత ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమకు నచ్చిన పార్టీకి, అభ్యర్థికి ఆయా గుర్తులపై ఓట్లు వేస్తారు.

కానీ ఇటీవల జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఈ ఓట్లు అనేకం పదుల సంఖ్యలో చెల్లకుండా పోయాయి. ఎన్నికలను నిర్వహించే ఉద్యోగుల ఓట్లే చెల్లకుండా పోవడం అంటే ఇది ఆషామాషీ విషయం కాదు. దీనిపై అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు కూడా ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది.

వారి ఓటు వారే సక్రమంగా వేసుకోలేని స్థితిలో ఉద్యోగులు ఉన్నారంటే, వారే ఓటు తర్వాత జరిగే ఎన్నికల విధులను మరి ఎలా నిర్వహిస్తారో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు తమ ఓటును తాము సక్రమంగా వేసుకోలేని ఉద్యోగులకు ప్రజల చేత ఓట్లు వేయించి, పోలింగ్ జరిపి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నైతిక అర్హత ఉందా? అన్న ప్రశ్నలు ప్రజల నుంచి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాలలో నిరక్షరాస్యులు, రైతులు తదితరులు వేసే ఓట్లు చెల్లకపోతే దానికి ఓ కారణం ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ విద్యావంతులైన వారి ఓట్లే చెల్లకపోతున్నాయంటే దీన్ని ఏమనాలో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.

ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కల్పించే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సైతం సక్రమంగా వినియోగించుకోలేని ఉద్యోగులు ఇంకా ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారంటే ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదా? అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా ఆయా ఎన్నికలకు ఆర్‌ఓలుగా, అసిస్టెంట్ ఆర్‌ఓలుగా, పీఓలుగా పనిచేస్తున్న వారు ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకొని, రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లోనైనా ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇన్‌వాలిడ్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *