విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ 102వ వార్డు కూటమి అభ్యర్థి గవర సోమశేఖర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచార తొలిరోజు కొండయ్యవలసలోని శ్రీ మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల అభినందనల మధ్య ప్రచారాన్ని ప్రారంభించారు.
అనంతరం కొండయ్యవలస గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకుని మద్దతు కోరారు. ఈ సందర్భంగా గవర సోమశేఖర్ మాట్లాడుతూ.. 102వ వార్డును జీవీఎంసీలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా ఉక్కు నిర్వాసిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తానని హామీ ఇచ్చారు. ఉక్కు నిర్వాసితులకు అన్ని విధాలా అండగా ఉంటానని, తనను సొంత బిడ్డలా ఆదరించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
వేదమంత్రాలు, డప్పు వాయిద్యాల నడుమ తొలిరోజు ప్రచారం సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో 102వ వార్డు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన మాజీ కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్, దాసరి త్రినాథ్, ఏబీ ప్రసాద్, ఎదూరి రాజేష్‌తో పాటు అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, టీడీపీ నాయకులు బండారు చందు, వడ్డాది రాము, బీజేపీ వార్డు అధ్యక్షుడు కోసూరి తాతారావు, జనసేన నాయకులు రాజా రత్నం, పాముల వసంత, బుదిరెడ్డి అప్పారావు, సాలాపు అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉక్కు నిర్వాసిత గ్రామాల ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.




