ఖమ్మం: ఆహార భద్రత ప్రమాణాలను ఉల్లంఘించిన సంస్థలపై అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా అదనపు కలెక్టర్ సమక్షంలో ఫుడ్ సేఫ్టీ అధికారి లోకేష్ 11 కేసులను పరిష్కరించి మొత్తం రూ.2.90 లక్షల జరిమానా విధించారు. ఇందులో రమేష్ దాబాకు రూ.లక్ష, హవేలికి రూ.75 వేలు, రిలయన్స్ సంస్థకు రూ.50 వేల జరిమానా విధించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. వ్యాపార సంస్థలు ఆహార భద్రత నిబంధనలను పాటిస్తూ వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించాలని అధికారులు సూచించారు.



