లోకేశ్వరం మండలంలోని అర్లీ, గోడిసెర గ్రామ పంచాయతీల పరిధిలో చేయూత పింఛన్ లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియను ఎంపీవో సల్మాన్ రాజ్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రభుత్వం అందిస్తున్న చేయూత పింఛన్ పథకానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంతోపాటు, వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారుల కుటుంబ పరిస్థితులు, అర్హతలు, అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలించి నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
అర్హులైన ఏ ఒక్కరూ పింఛన్ సౌకర్యానికి దూరం కాకుండా, అనర్హులు జాబితాలో చేరకుండా వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. లబ్ధిదారుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అవసరమైన ధ్రువపత్రాలు, క్షేత్రస్థాయి వివరాలను పరిశీలించాలని సూచించారు.
గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారులకు సంబంధించిన సమాచారాన్ని సక్రమంగా సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామంలో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రసన్న వినోద్, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ జీపీఓ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

