ఖమ్మం: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని బీజేపీ ఖమ్మం టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్ రావు కోరారు. మంగళవారం పున్నమి ప్రతినిధితో చరవాణిలో మాట్లాడిన ఆయన, తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో గణపయ్యను కొలిచిన భక్తులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. నిమజ్జన సమయంలో అత్యుత్సాహానికి పోకుండా పోలీసు, అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. నీటి లోతు, విద్యుత్ స్తంభాలు, వాహనాల రాకపోకల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి గణనాథులను గంగమ్మ ఒడికి సురక్షితంగా సాగనంపాలని రుద్రగాని మాధవ్ రావు ఆకాంక్షించారు.



