సింగరేణిలో నల్ల బ్యాడ్జీలతో హెచ్‌ఎంఎస్ నిరసన
మెడికల్ బోర్డులో కార్మికులకు అన్యాయం జరిగిందని ఆరోపణలు.. నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహించాలని డిమాండ్
గోలేటి, జూలై 20: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీఎచ్‌పీలో హెచ్‌ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు మాట్లాడుతూ, ఇటీవల సింగరేణి యాజమాన్యం నిర్వహించిన మెడికల్ బోర్డుకు 120 మంది కార్మికులను పిలిచినప్పటికీ, ముందస్తు సమాచారం సక్రమంగా అందకపోవడంతో 92 మంది మాత్రమే హాజరయ్యారని తెలిపారు. దీంతో మిగిలిన అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.
కార్మికుల ఓట్లతో గుర్తింపు పొందిన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు కార్మికుల హక్కుల పరిరక్షణలో సమర్థవంతంగా వ్యవహరించలేదని విమర్శించారు. హెచ్‌ఎంఎస్ పోరాటాల ఫలితంగానే మెడికల్ బోర్డు నిర్వహించినప్పటికీ, అర్హులైన కార్మికులందరికీ న్యాయం జరగలేదన్నారు.
కార్మికుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతి నెల రెండు మెడికల్ బోర్డులు నిర్వహించి, అర్హులైన అనారోగ్య కార్మికులందరినీ మెడికల్ అన్‌ఫిట్‌గా ప్రకటించాలని హెచ్‌ఎంఎస్ యూనియన్ డిమాండ్ చేసింది. లేదంటే కార్మికుల తరఫున గాంధేయ మార్గంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది.
ఈ నిరసన కార్యక్రమంలో పిట్ సెక్రటరీ ఎం.డి. ఆరీఫ్, ఏరియా ఆర్గనైజర్ అంబటి ప్రశాంత్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఎం. ఉమామహేశ్వర్, బాలేష్‌తో పాటు యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.



