Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీసిటీని సందర్శించిన జపాన్ వ్యాపార ప్రతినిధి బృందం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీసిటీని సందర్శించిన జపాన్ వ్యాపార ప్రతినిధి బృందం

వార్త ముఖ్యాంశాలు

  • - వివిధ రంగాల్లో వ్యాపార, పెట్టుబడి అవకాశాల పరిశీలన జపాన్‌లోని ఎహిమే రాష్ట్రానికి చెందిన 11 మంది సభ్యుల వ్యాపార ప్రతినిధి బృందం బుధవారం శ్రీసిటీని సందర్శించింది.
  • భారత్‌లో వ్యాపార విస్తరణ, పెట్టుబడి అవకాశాల పరిశీలనలో భాగంగా ఆ ప్రాంత సీనియర్ ప్రభుత్వ అధికారులు యమటో ఇకెడా, అకిరా మౌరి నేతృత్వంలో ఈ బృందం విచ్చేసింది.
  • చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ వైస్ కాన్సుల్ షున్ సకాయ్ ఈ పర్యటనను సమన్వయం చేశారు.

– వివిధ రంగాల్లో వ్యాపార, పెట్టుబడి అవకాశాల పరిశీలన
జపాన్‌లోని ఎహిమే రాష్ట్రానికి చెందిన 11 మంది సభ్యుల వ్యాపార ప్రతినిధి బృందం బుధవారం శ్రీసిటీని సందర్శించింది. భారత్‌లో వ్యాపార విస్తరణ, పెట్టుబడి అవకాశాల పరిశీలనలో భాగంగా ఆ ప్రాంత సీనియర్ ప్రభుత్వ అధికారులు యమటో ఇకెడా, అకిరా మౌరి నేతృత్వంలో ఈ బృందం విచ్చేసింది. చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ వైస్ కాన్సుల్ షున్ సకాయ్ ఈ పర్యటనను సమన్వయం చేశారు.

బృందానికి సాదర స్వాగతం పలికిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, వివిధ పారిశ్రామిక రంగాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం, వేగవంతమైన అనుమతులు, వివిధ రంగాలకు అందిస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాల గురించి కూడా విశదీకరించారు.

ఎహిమే రాష్ట్ర ప్రతినిధి బృందాలు వరుసగా శ్రీసిటీని సందర్శించడం జపాన్ పారిశ్రామిక వర్గాల్లో శ్రీసిటీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని డాక్టర్ సన్నారెడ్డి పేర్కొన్నారు. యునిచార్మ్ సహా 35కి పైగా జపాన్ కంపెనీలు ఇప్పటికే శ్రీసిటీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల (SMEs) పారిశ్రామికవేత్తలు భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు శ్రీసిటీని అనువైన వేదికగా పరిగణించాలని ఆయన ఆహ్వానించారు.

శ్రీసిటీలోని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, జపాన్ కంపెనీల బలమైన ఉనికిని ప్రతినిధి బృందం ప్రశంసించింది. భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలనుకునే ఎహిమే రాష్ట్ర కంపెనీలకు శ్రీసిటీ ఆకర్షణీయమైన గమ్యస్థానమని అభిప్రాయపడింది. తయారీ రంగం, ఇంజినీరింగ్, ఇంధనం, పర్యావరణ పరిష్కారాల వంటి రంగాల్లో పరస్పర సహకారానికి మంచి అవకాశాలున్నాయని పేర్కొంది.

ఈ ప్రతినిధి బృందంలో ఎహిమే రాష్ట్ర ఆర్థిక, కార్మిక శాఖ, పారిశ్రామిక విధాన విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు, చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు, జపాన్ నస్ కో లిమిటెడ్, సన్‌వెల్స్ కో లిమిటెడ్ సంస్థల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. పారిశ్రామిక విధానాలు, ఆర్థిక అభివృద్ధి, ఇంధనం, పర్యావరణ సలహా సేవలు, ఇంజినీరింగ్, ఐటీ, సాంకేతిక సిబ్బంది నియామకం, యంత్రాలు, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ వంటి రంగాలపై వీరు ఆసక్తి కనబరిచారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *