నాలుగు విభాగాలుగా ప్రత్యేక కార్యాచరణ
విశాఖపట్నం జిల్లా,,ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 19::
కేజీబీవీ విద్యార్థినుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అమలు చేస్తున్న **విజయపథం కార్యక్రమం** విశాఖ జిల్లాలోని మూడు కేజీబీవీలలో పకడ్బందీగా కొనసాగుతోంది.
కేజీబీవీ రాష్ట్ర కార్యదర్శి దేవానందరెడ్డి సూచనల మేరకు విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలు, ప్రస్తుత విద్యా స్థాయిలను బట్టి **ఉన్నతి, ప్రగతి, దీప్తి, స్ఫూర్తి** అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించి ప్రత్యేక బోధనా ప్రణాళికను అమలు చేస్తున్నారు.
ప్రతి విభాగానికి అనుగుణంగా ప్రత్యేక అధ్యయన సామగ్రి, సబ్జెక్టుల వారీగా ప్రశ్నాబ్యాంకులు, ప్రాక్టీస్ ప్రశ్నపత్రాలు, రోజువారీ అభ్యాసం, వారాంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్టులను నిర్వహిస్తున్నారు. విద్యార్థినుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం, విషయ పరిజ్ఞానం పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
విశాఖపట్నం జిల్లాలోని కేజీబీవీ ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం పాఠశాలల్లో విజయపథం కార్యక్రమం అమలు తీరును సమగ్ర శిక్ష ఏపీసీ జె. చంద్రశేఖర్, జీసీడీవో శ్రీదేవి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మూడు పాఠశాలల ప్రిన్సిపాళ్లు డి. చంద్రకళ, గంగా కుమారి, గ్రేస్ లిల్లీ విద్యార్థినుల విద్యా ప్రగతి, అమలు చేస్తున్న ప్రత్యేక కార్యాచరణ వివరాలను అధికారులకు తెలియజేశారు.
విద్యార్థినుల విద్యా ప్రగతిని సమీక్షించిన అధికారులు, అభ్యసనంలో వెనుకబడిన వారికి ప్రత్యేక రెమిడియల్ బోధన అందించాలని, ప్రతిభావంతులకు మరింత మెరుగైన మార్గదర్శకత్వం కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రశ్నాబ్యాంకులు, అధ్యయన సామగ్రిని సమర్థవంతంగా వినియోగిస్తూ నిరంతర పరీక్షల ద్వారా విద్యార్థినుల ప్రగతిని అంచనా వేయాలని, ప్రతి విద్యార్థినీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
**ప్రతి విద్యార్థినిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, విజయ శిఖరాలకు చేర్చడమే విజయపథం లక్ష్యం. కేవలం పరీక్షల్లో మార్కులే కాదు.. బాలికల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.**

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్