వార్త ముఖ్యాంశాలు
- *ప్రేమ వ్యవహారం బయటపడిందనే ఆగ్రహం..
- నిశ్చితార్థానికి ముందురోజే గొంతు నులిమి హత్య..
- ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం!* ఆదిలాబాద్, నవంబర్ 26 | పున్నమి; కన్నబిడ్డ భవిష్యత్తుకు అండగా నిలవాల్సిన తండ్రే కాలయముడయ్యాడు.
*ప్రేమ వ్యవహారం బయటపడిందనే ఆగ్రహం.. నిశ్చితార్థానికి ముందురోజే గొంతు నులిమి హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం!*
ఆదిలాబాద్, నవంబర్ 26 | పున్నమి;
కన్నబిడ్డ భవిష్యత్తుకు అండగా నిలవాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. కూతురి ప్రేమ వ్యవహారం కుటుంబ పరువుకు భంగం కలిగిస్తుందనే అహంకారంతో కన్నకూతురి ప్రాణాలనే బలితీసుకున్నాడు. తనకు నచ్చిన వ్యక్తితోనే వివాహం జరగాలన్న కుటుంబ నిర్ణయానికి భిన్నంగా కూతురు మరో వ్యక్తిని ప్రేమిస్తోందని తెలుసుకున్న తండ్రి, చివరకు ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన అమానవీయ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
*నిశ్చితార్థానికి ముందే విషాదం..*
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాస్, సుమిత్ర దంపతుల కుమార్తె కళ్యాణి (18). ఆమెకు నార్నూర్ ప్రాంతానికి చెందిన మరో యువకుడితో వివాహ సంబంధం ఖరారు చేశారు. నవంబర్ 25న నిశ్చితార్థం జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అయితే నవంబర్ 23న కళ్యాణి దిగులుగా ఉండటాన్ని గమనించిన తండ్రి కైలాస్ కారణం ఏమిటని ప్రశ్నించాడు. ఈ క్రమంలో తనకు సమీప బంధువైన యువకుడితో ప్రేమ సంబంధం ఉందని కళ్యాణి తల్లిదండ్రులకు వెల్లడించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
*నిద్రలోనే గొంతు నులిమి హత్య..*
కూతురు ప్రేమ వ్యవహారం తెలుసుకున్న కైలాస్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. కుటుంబ పరువు పోతుందనే భావనతో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. నవంబర్ 24వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో కళ్యాణి గదిలోకి వెళ్లి ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం హత్య విషయం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని మరో గదిలోకి తీసుకెళ్లి చున్నీతో ఉరివేసినట్లు చిత్రీకరించి, ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడు.
*అనుమానాలకు తావిచ్చిన అంత్యక్రియలు..*
ఉదయం సుమారు 5 గంటల సమయంలో తల్లి సుమిత్ర నిద్రలేచి చూడగా కుమార్తె ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. తొలుత కళ్యాణి ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ, ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయడం స్థానికుల్లో అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామాలపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
*పోలీసుల విచారణలో బయటపడిన అసలు నిజం..*
సమాచారం అందుకున్న నార్నూర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. తండ్రి కైలాస్ను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ పరువు పోతుందనే భయంతో తానే కుమార్తెను హత్య చేసినట్లు కైలాస్ అంగీకరించాడని నార్నూర్ సీఐ గురుస్వామి వెల్లడించినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని హత్యకు సంబంధించిన సెక్షన్ 103(1), సాక్ష్యాలను మాయం చేయడానికి సంబంధించిన సెక్షన్ 238 కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
*పరువు కంటే ప్రాణం ముఖ్యం..*
ప్రేమించడం నేరం కాదు. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో యువతీ యువకులకు తమ అభిప్రాయాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని మాట్లాడాల్సిన తల్లిదండ్రులు, కుటుంబ గౌరవం పేరుతో ప్రాణాలు తీసే స్థాయికి దిగజారడం అత్యంత దారుణం. సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతో కన్నబిడ్డల జీవితాలనే బలితీసుకోవడం ఏ సంస్కృతికీ, ఏ సంప్రదాయానికీ గౌరవం కాదు.
నిశ్చితార్థపు వేడుక జరగాల్సిన ఇంట్లోనే చావు కేకలు వినిపించడం స్థానికులను కలచివేసింది. పరువు పేరుతో ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పున్నమి రిపోర్టర్ | భూక్య రాము నాయక్ |
మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్