వార్త ముఖ్యాంశాలు
- -- ప్రైవేట్ కార్ల పార్కింగ్‌గా మారిన నవాబుపేట రైతుబజారు -- రైతుబజార్లపై అధికారుల నిర్లక్ష్యం -- బజార్ల తాగునీటితోనే కార్ల వాషింగ్ --జిల్లా కేంద్రంలో అధికారులు ఉన్నారా?
- జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో రెండు రైతుబజార్లు ఉన్నాయి.
- రైతులు తాము పండించిన ఉత్పత్తులను తామే స్వయంగా మార్కెట్‌కు తెచ్చుకుని అక్కడ తాజా కూరగాయలను అమ్ముకుని బాగా లబ్ధి పొందాలన్న లక్ష్యంతో, సదుద్దేశంతో నాటి ప్రభుత్వాలు రైతుబజార్లను కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తే, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఆ లక్ష్యం నెరవేరకపోగా, జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో…
— ప్రైవేట్ కార్ల పార్కింగ్‌గా మారిన నవాబుపేట రైతుబజారు
— రైతుబజార్లపై అధికారుల నిర్లక్ష్యం
— బజార్ల తాగునీటితోనే కార్ల వాషింగ్
–జిల్లా కేంద్రంలో అధికారులు ఉన్నారా?
జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో రెండు రైతుబజార్లు ఉన్నాయి. రైతులు తాము పండించిన ఉత్పత్తులను తామే స్వయంగా మార్కెట్‌కు తెచ్చుకుని అక్కడ తాజా కూరగాయలను అమ్ముకుని బాగా లబ్ధి పొందాలన్న లక్ష్యంతో, సదుద్దేశంతో నాటి ప్రభుత్వాలు రైతుబజార్లను కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తే, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఆ లక్ష్యం నెరవేరకపోగా, జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో ఉన్న రెండు రైతుబజార్లు గాడి తప్పి రైతు బేజార్లుగా మారిన సంఘటనలు ఇవి.
నెల్లూరు నగరంలో ఫతేఖాన్‌పేట, నవాబుపేట ప్రాంతాల్లో రెండు రైతుబజార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు రైతుబజార్లు దిక్కూ దివాణం లేని స్థితిలో త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. ఫతేఖాన్‌పేట రైతుబజారులో పరిస్థితి దారుణంగా ఉండగా, నవాబుపేట రైతుబజారు ఆ సమీప గృహ యజమానుల ప్రైవేట్ కార్లకు పార్కింగ్ నిలయంగా మారిపోయింది.
రైతుబజారులోని తాగునీటి ట్యాంకు నుంచి నీటిని పైపుల ద్వారా వాడుకుంటూ కార్లను యథేచ్ఛగా వాషింగ్ చేసుకుంటున్నారు. అసలు ఈ రైతుబజారును పౌర సరఫరాల సంస్థ వారు గాలికి వదిలేశారా అని అనిపించక మానదు.
రైతుబజారులోని కొద్ది దుకాణాల్లో మాత్రమే కూరగాయల అంగళ్లు, టెంకాయల అంగళ్లు ఉండగా, మిగతా దుకాణాలు జనపనార సంచులతో నిండి కనిపిస్తున్నాయి. మసక పడితే చాలు ఇక్కడ మందుబాబుల స్వైరవిహారం కనిపిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నవాబుపేట రైతుబజారు మారిందంటే అతిశయోక్తి కాదేమో.
అసలు రైతుబజార్ల స్థాపిత లక్ష్యం ఏమిటి? ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర ఏమిటి? అని ప్రశ్నించుకుంటే, రైతుబజార్లను నెల్లూరు నగరంలో సంబంధిత అధికారులు నడిఏట్లో వాటి మానాన వాటిని వదిలేసినట్లు స్పష్టంగా గోచరిస్తుంది.
నవాబుపేట రైతుబజారులో పారిశుధ్యం మచ్చుకైనా కనిపించదు. వసతులు లేవు, సౌకర్యాలు లేవు. అధికారులు చెప్పే స్వచ్ఛ నెల్లూరు కనిపించదు. మొత్తం ఈ రైతుబజారు అగమ్యగోచరంగా కనిపిస్తుంది.
రైతుబజారుకు వెళ్లాలంటే వర్షపు నీటి మడుగులు తొక్కాల్సిందే. బురదలో కాలు పెట్టాల్సిందే. అసలు ఇది ప్రభుత్వం నిర్మించిన రైతుబజారా? లేక శిథిలావస్థకు చేరుకున్న రాజవంశీయుల శిథిల ఆస్తులా? అన్న విధంగా నవాబుపేట రైతుబజారు తయారయ్యింది.
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ రైతుబజారుపై పర్యవేక్షణ చేయాల్సి ఉంది. కానీ వారు ఎక్కడ ఉన్నారో అడ్రస్ కూడా కనిపించడం లేదు. ఇక రైతుబజారు ఎస్టేట్‌కు సంబంధించి ఒక మేనేజర్, తదితర ఉద్యోగులు ఉండాల్సి ఉంది. బజారును శుభ్రం చేయడానికి స్వీపర్ ఉండాలి. వీరంతా ఎక్కడ ఉన్నారో, అసలు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్ వారైనా ఒక్కసారి నగరంలోనే ఉన్న ఈ రైతుబజార్లను ఆకస్మిక తనిఖీలు చేయాల్సి ఉంది. ఈ రైతుబజార్ల దురవస్థను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్