పగటిపూట వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది. రాత్రి వేళల్లో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు.* గాలిలో తేమ శాతం పడిపోవడంతో వేడి తీవ్రత అధికంగా పెరిగింది. ఎండలు వేసవి గుర్తుచేస్తుండటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. కొన్ని రోజులుగా ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి తదితర ప్రాంతాల్లో సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది.
శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం 60 నుంచి 70 శాతం మధ్య నమోదు కావాల్సి ఉండగా కొన్నిచోట్ల 50 శాతం కంటే తక్కువగా ఉంటోంది. మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట గాలి కాలుష్యం వల్ల వేడి పెరుగుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
*గాలిలోని తేమ పడిపోవడం*
వేసవిలోనూ చల్లని వాతావరణం ఉండే హైదరాబాద్‌లో శుక్రవారం 49 శాతానికి గాలిలోని తేమ పడిపోవడం తీవ్రతకు అద్దం పడుతోంది. రామగుండంలో గాలిలో తేమ శాతం 42, హనుమకొండలో 49, మహబూబ్‌నగర్‌లో 51, నిజామాబాద్‌లో 45, నల్గొండలో 45 శాతం నమోదైంది. రానున్న మరో మూడు రోజుల్లో పెద్దపల్లి, ఖమ్మం, మంచిర్యాల, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జగిత్యాల, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. *మరోవైపు నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణపై నుంచి పూర్తిగా నిష్క్రమించడం గమనార్హం.*
