*ట్రాఫిక్ అంతరాయాలకు కారణమవుతున్న ఆక్రమణల తొలగింపు – దుకాణదారులకు సూచనలు, హెచ్చరికలు.*
చిత్తూరు, అక్టోబర్ 06 ( పున్నమి ప్రతినిధి ) :
*చిత్తూరు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజలకు సురక్షితమైన మరియు సాఫీగా రాకపోకలు సాగేందుకు చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.*
జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ P. నరసింహ రాజు , ఎస్‌ఐ మరియు సిబ్బందితో కలిసి చిత్తూరు కార్పొరేషన్‌కు చెందిన హెల్త్, శానిటరీ, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమన్వయంతో నగరంలోని ఎం.జి.ఆర్. స్ట్రీట్, దర్గా స్ట్రీట్, ఎం.ఎస్.ఆర్. జంక్షన్ మరియు పలమనేరు రోడ్ ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రహదారులపైకి వచ్చి వాహనాలు, పాదచారుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించడం జరిగింది. అలాగే రోడ్లను ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంబంధిత దుకాణదారులకు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకుండా, తమ వ్యాపార సామగ్రిని రహదారులపైకి తీసుకురాకుండా తగిన సూచనలు మరియు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ P. నరసింహ రాజు మాట్లాడుతూ, నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసు శాఖతో పాటు ప్రజలు, వ్యాపారులు మరియు సంబంధిత శాఖలు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వ్యాపారులు తమ దుకాణాల పరిధిని దాటి రహదారులు, ఫుట్‌పాత్‌లపై వస్తువులను ఏర్పాటు చేయవద్దని, ప్రజలకు మరియు వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలిగించవద్దని సూచించారు. ఇకపై కూడా ఆక్రమణలపై నిరంతర తనిఖీలు నిర్వహించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. నగరంలో ట్రాఫిక్ క్రమశిక్షణను పాటిస్తూ, పోలీసులకు మరియు మున్సిపల్ సిబ్బందికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు.


