నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు అందిస్తున్న భోజనంలో పురుగులు కనిపిస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.సుమారు పది రోజుల క్రితం మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించాయని, తాజాగా గురువారం ఉదయం వడ్డించిన ఉప్మాలోనూ పురుగులు ఉన్నట్లు విద్యార్థినులు గుర్తించారని తల్లిదండ్రులు తెలిపారు.
భోజనంలో పురుగులు వస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థినులను కొందరు ఉపాధ్యాయురాళ్లు బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పాఠశాలలో జరుగుతున్న విషయాలను బయటకు చెబితే విద్యార్థినులను పాఠశాల నుంచి తీసి పంపిస్తామని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు.విద్యార్థినుల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావడంతో జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, పాఠశాలలో ఆహార నాణ్యతను పరిశీలించి పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.



