నెల్లిమంద (సోమల), అక్టోబర్ 12 (భాను ప్రసాద్ నాయుడు పున్నమి న్యూస్ ప్రతినిధి):
సోమల మండలంలోని నెల్లిమంద పంచాయతీ పరిధిలో గల కమ్మపల్లి గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి కన్నెపూజ మహోత్సవాన్ని ‘కమ్మపల్లె యూత్’ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. గ్రామంలోని యువతంతా ఏకతాటిపైకి వచ్చి సమష్టిగా చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికులను, భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
గురుస్వాముల పర్యవేక్షణలో కమ్మపల్లె యూత్ సభ్యులు పూజా వేదికను సుమారు వందలాది కిలోల బంతి, చామంతి పూలతో పరమశివుడి లింగాకారంలో అత్యద్భుతంగా అలంకరించి నయనానందకరంగా తీర్చిదిద్దారు. పద్దెనిమిది మెట్లతో కూడిన పడిపీఠాన్ని ప్రత్యేక పుష్పాలతో తీర్చిదిద్ది విశేష అభిషేకాలు, పడిపూజ, దీపారాధనలు నిర్వహించారు. భక్తుల ‘స్వామియే శరణం అయ్యప్ప’ శరణుఘోషలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. పూజా కార్యక్రమాల అనంతరం కమ్మపల్లె యూత్ ఆధ్వర్యంలో తరలివచ్చిన భక్తులందరికీ విస్తృత ఏర్పాట్లతో భారీ అన్నదాన వితరణ చేపట్టారు. ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయడంలో కమ్మపల్లె యూత్ చూపిన సేవాతత్పరత, కృషిని గ్రామ పెద్దలు, భక్తులు ఘనంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమ్మపల్లి యువకులు, అయ్యప్ప మాలధారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
(శివలింగ ఆకారంలో ప్రత్యేక పుష్పాలంకరణ.. గ్రామస్థుల ప్రశంసలు)






