ఖమ్మం: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు MY Bharat–ఖమ్మం ఆధ్వర్యంలో నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సేవా పాక్వడ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించడంతో పాటు ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం, ర్యాలీ చేపట్టారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు MY Bharat–ఖమ్మం ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన అధికారి శ్రీ రాంబాబు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దానమ్మ, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ రామయ్య, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు ఖమ్మం MY Bharat వాలంటీర్ రాగాసుధ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ స్వచ్ఛమైన భారత్, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత, సామాజిక బాధ్యత, దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం అవసరమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది.



