పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండ..
సీఎం సహాయనిధితో ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు.
వీరులపాడు: పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు అన్నారు.
వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో మంగళవారం నాడు వీరులపాడు మండలానికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను కూటమి నేతలతో కలిసి లబ్ధిదారులకు నేరుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య గారు మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
నందిగామ నియోజకవర్గం మొత్తం 276 మంది లబ్ధిదారులకు రూ.1,37,11,559 విలువైన సీఎం సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. అందులో వీరులపాడు మండలానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు రూ.25,51,383 ఆర్థిక సాయం అందిందని వెల్లడించారు.కష్టకాలంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సౌమ్య గారు సూచించారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నందిగామ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




