– పౌష్టికాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం
గర్భిణీలు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ఓబులవారిపల్లి-2 అంగన్వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య ఆహారం, పోషక విలువలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ గుణవతి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆకు కూరలు, పండ్లు, పాలు, గుడ్లు తదితర పోషక పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. ఆరు నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు వయసుకు తగిన పోషకాహారం అందించాలని తెలిపారు. ఆహారంతో పాటు చిన్నారులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.


