*స్థానిక చరిత్రల అన్వేషణలో ఎమ్మార్వో క్రాంతికుమార్*
చరిత్ర పరిరక్షణకు చేస్తున్న కృషిని కొనియాడిన జిల్లా రచయితల సంఘం.. ఘనంగా సన్మానం
ఖాజీపేట ప్రతినిధి
ఖాజీపేట: స్థానిక చరిత్రల పరిరక్షణ, పరిశోధన పట్ల ఆసక్తి కనబరుస్తున్న ఖాజీపేట మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) ఎం. క్రాంతికుమార్‌ను వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఘనంగా సన్మానించింది. గ్రామాల చరిత్రను సేకరించి భావితరాలకు అందించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో విధులు నిర్వహించిన సమయంలో అక్కడి స్థానిక చరిత్రలను పరిశోధించి గ్రంథరూపంలో తీసుకొచ్చిన క్రాంతికుమార్, ప్రస్తుతం ఖాజీపేట మండలంలోనూ ఖాజీపేట, పత్తూరు, తుడుమలదిన్నె తదితర గ్రామాల చరిత్రను అధ్యయనం చేస్తుండటం సంతోషకరమన్నారు. ఇటువంటి అధికారులు స్థానిక చరిత్ర పరిరక్షణకు ముందుకు రావడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.
రచయితల సంఘం సభ్యుడు డాక్టర్ తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా క్రాంతికుమార్ రచించిన “ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి” గ్రంథం ఎంతో ప్రయోజనకరంగా ఉందని కొనియాడారు.
సన్మానానికి స్పందించిన ఎమ్మార్వో క్రాంతికుమార్ మాట్లాడుతూ, ఖాజీపేట ప్రాంతంలో విధులు నిర్వహించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఉత్తర హరివంశం రచయిత నాచన సోమనాథుడు తుడుమలదిన్నెకు చెందినవారని, కవి చౌడప్ప ఈ ప్రాంతంతో అనుబంధం కలిగి ఉండటం ఈ ప్రాంత చారిత్రక విశిష్టతకు నిదర్శనమని అన్నారు. ఈ ప్రాంతంలోని స్థానిక చరిత్రలను మరింత లోతుగా అధ్యయనం చేసి వెలుగులోకి తీసుకురావడానికి తన వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో వెన్నపూస చెన్నారెడ్డి, మూల ఈశ్వరరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, చిన్న అయ్యవారురెడ్డి, గణేష్‌రెడ్డి, సానేపల్లె సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


