ట్రయల్స్‌ను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని వెల్లడి
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శాఫ్ స్టేట్ స్పోర్ట్స్ అకాడమీలకు క్రీడాకారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌కు విశాఖపట్నంలోని మధురవాడ బక్కన్నపాలెం శాఫ్ స్టేడియంలో భారీ స్పందన లభించింది. రాష్ట్ర క్రీడా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ట్రయల్స్‌ను ఆదివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారుల ప్రతిభను పరిశీలించడంతో పాటు స్టేడియంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్‌పై స్వయంగా సైక్లింగ్ చేశారు. అనంతరం వాటర్ స్పోర్ట్స్‌కు సంబంధించిన పరికరాలను పరిశీలించి, వాటి వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో ముచ్చటించి వారికి అందిస్తున్న వసతులపై ఆరా తీశారు. 2024–29 కాలానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హులైన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తూ క్రీడాకారుల శారీరక దారుఢ్యం, ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాలు, ఆటలో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాశాఖ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక శిక్షణా క్యాంపులు ఏర్పాటు చేసిందన్నారు. క్రీడాకారులకు లాడ్జింగ్, బోర్డింగ్‌తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాలలో 16 వేల ఉద్యోగాల్లో 400 మందికి స్పోర్ట్స్ కోటా ద్వారా అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. క్రీడలను అలవాటుగా మార్చుకుంటే యువతకు మంచి భవిష్యత్ అవకాశాలు లభిస్తాయని సూచించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలుగా మూడు స్టేట్ స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విశాఖ కేంద్రంలో సైక్లింగ్, అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వాటర్ స్పోర్ట్స్‌ను గంభీరం ప్రాంతంలో, మిగతా క్రీడలను శాఫ్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గుర్తు చేశారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన క్రీడా వసతులను పునరుద్ధరించేందుకు రూ.2.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కొమ్మాదిలో 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్రీడా స్థలాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్-1 క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పారా అథ్లెటిక్స్ క్రీడాకారులకు కూడా అన్ని వసతులు కల్పిస్తున్నామని, వారిలో అంతర్జాతీయ అవార్డు గ్రహీతలు ఉన్నారని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని క్రీడా సంఘాలతో సమన్వయం చేసుకుంటూ క్రీడా రంగాభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందన్నారు. ఎంపికైన క్రీడాకారులకు శాఫ్ అకాడమీల ద్వారా ఉన్నత స్థాయి శిక్షణ, ఆధునిక సౌకర్యాలు, నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక కోచింగ్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ అకాడమీల లక్ష్యమని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జూన్ గ్యాలియెట్, ఇతర అధికారులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, సెలక్షన్ కమిటీ సభ్యులు, శిక్షకులు మరియు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.

