గాజువాక, నవంబర్ 2 (పున్నమి ప్రతినిధి):
విశాఖపట్నంలోని నాతయ్యపాలెం కృష్ణ మహంతి చెరువులో సోమవారం తెల్లవారుజామున థార్ కారు బోల్తాపడి చెరువులోకి దూసుకెళ్లడంతో కిల్లి వరుణ్ కుమార్ (26) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
మర్రిపాలెంలో నివాసం ఉంటున్న వరుణ్, తనకు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న థార్ కారులో షీలానగర్‌లోని కొత్త ఫ్లాట్‌కు వెళ్తుండగా కిమ్స్ ఆస్పత్రి వెనుక ఉన్న చెరువు సమీపంలో మలుపు వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా, ఇంతలోనే వరుణ్ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.



