ఫార్మాసిటీ భూములపై ఉద్రిక్తత… పోలీస్ స్టేషన్ ముందు కూలీల ధర్నా!
పున్నమి న్యూస్
03 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం నక్కర్త గ్రామ పరిధిలో ఫార్మాసిటీ భూముల వ్యవహారం మరింత ఉద్రిక్తంగా మారింది. భూములకు సంబంధించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, కేసులు నమోదు అయినప్పటికీ ఫార్మాసిటీ భూముల్లో చట్టవ్యతిరేకంగా పనులు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ కూలీలు, మహిళలు, గ్రామస్తులు నక్కర్త మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు భారీగా ధర్నాకు దిగారు.
“కేసు కోర్టులో ఉండగా… భూముల్లో పనులు ఎలా చేస్తున్నారు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కూలీలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ పేరుతో తమ భూములను బలవంతంగా ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఫార్మాసిటీ భూముల్లో జెసిబిలు మరియు యంత్రాలతో పనులు కొనసాగుతుండటంతో స్థానిక ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
ధర్నాలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ తమ కుటుంబాల జీవనాధారం అయిన భూములను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. “పేదల భూములను కాపాడాలి… కేసులు ఉన్న భూముల్లో పనులు వెంటనే ఆపాలి…” అంటూ నినాదాలు చేశారు. కొందరు మహిళలు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.
గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. దీంతో పెద్ద సంఖ్యలో కూలీలు, రైతులు, మహిళలు కలిసి పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు ప్రజలను సముదాయించే ప్రయత్నం చేశారు.
ఆందోళనకారులు మాట్లాడుతూ, “చట్టపరమైన వివాదం ముగిసే వరకు భూముల్లో ఎలాంటి పనులు చేయకూడదు. అధికారుల నిర్లక్ష్యంతో కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు” అని మండిపడ్డారు. ఫార్మాసిటీ భూములు లో జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని గ్రామస్తులతో చర్చించినట్లు సమాచారం. కేసు చట్టపరమైన పరిధిలో ఉందని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయినప్పటికీ బాధితులు మాత్రం పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఫార్మాసిటీ భూముల వ్యవహారం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భూముల వివాదంపై ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



