✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలందొండపూడి లో నేషనల్ హైవే (NH 365BB) రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో దొండపూడి గ్రామస్తులు, వ్యాపారస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, దుకాణాలు కోల్పోయి, జీవనాధారం లేక, ప్రభుత్వ సహాయం అందక 50 సంవత్సరాలకు పైబడి రోడ్డు ప్రక్కన నివసిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్న నిర్వాసితుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. చుట్టుపక్కల అన్ని గ్రామాలకు నష్టపరిహారం అందించి, ఒక్క దొండపూడి వాసులకు ఇవ్వకపోవడంలో వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు, గత ఏప్రిల్ నెలలో రోడ్డు పనుల్లో భాగంగా డ్రైనేజీ పూడికతీత తీసి అలాగే వదిలేయడంతో, రోడ్డు పక్కన ఉన్న భవనాలు, షాపులు దెబ్బతినే ప్రమాదం ఉందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ తెరిచిన డ్రైనేజీల వల్ల ముసలివారు ఇళ్లలోకి వెళ్లడానికి, చిన్న పిల్లలు తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు; ఎవరైనా ఇళ్ల నుండి బయటకు వస్తే నేరుగా ఆ డ్రైనేజీ గుంతల్లో పడిపోయేలా పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. దీనితో పాటు గ్రామంలో తాగునీటి పైప్‌లైన్లు దెబ్బతినడం వల్ల వాటర్ సప్లై లేక దొండపూడి వాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ఎన్‌హెచ్ 365BB కాంట్రాక్టర్లు తక్షణమే స్పందించి, దొండపూడి ప్రమాదకరంగా మారిన డ్రైనేజీ పనులను పూర్తి చేసి, నీటి సమస్యను పరిష్కరించి అందరికీ తగు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
End

