జూన్ 4 నుంచి 12 వరకు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమాలు
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి ): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, ఈ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయినా వాటిని అమలు చేయకపోవడం ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్లేనని వారు విమర్శించారు.ఆత్మకూరులోని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం “వెన్నుపోటుకు రెండేళ్లు” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, పట్టణ కన్వీనర్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే నవరత్నాల పథకాలను అమలు చేసి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీలను అమలు చేయలేదని విమర్శించారు.సంపద సృష్టిస్తామని, అభివృద్ధి తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో రెండేళ్లుగా విధ్వంసకర పాలన కొనసాగుతోందని, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని అన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిందని, సుమారు 1.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు.జూన్ 4 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమాల ద్వారా కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించనున్నట్లు నాయకులు తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుత ప్రభుత్వ పాలన మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండల కన్వీనర్ బిజివేముల పిచ్చిరెడ్డి, మర్రిపాడు మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు నందా ఓబులేసు, మున్సిపల్ విభాగ అధ్యక్షుడు చెరుకూరు కామాక్షయ్యనాయుడు, ఆండ్రా సుబ్బారెడ్డి, ఇందూరు సురేంద్రరెడ్డి, నోటి వినయ్ కుమార్ రెడ్డి, బత్తిన నారాయణరెడ్డి, పాలేటి వెంగళరెడ్డి, కల్పనా రెడ్డి, గడ్డం శ్రీనివాసులరెడ్డి, కొప్పోలు వెంకటేశ్వర్లు, తోడేటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.


