ఆత్మకూరు, జూలై 19 ( పున్నమి ప్రతినిధి):కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సామాజిక శంఖారావం” కార్యక్రమం ఆత్మకూరు రూరల్ మండలం మురగళ్ల గ్రామంలోని దళితవాడలో నిర్వహించారు.ఈ సందర్భంగా దళితవాడలో నివసిస్తున్న సుమారు 80 కుటుంబాల ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. అనాదిగా తమపై కుల వివక్ష కొనసాగుతోందని, ప్రధాన గ్రామంలోని దేవాలయంలో ప్రవేశానికి అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో స్మశానం లేకపోవడం, సుమారు 70 కుటుంబాలకు సెంటు భూములు లేకపోవడం, 20 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు కాకపోవడం వంటి సమస్యలను వివరించారు.అలాగే, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా గత నాలుగేళ్లుగా చేపల చెరువులో చేపలు పట్టుకునే అవకాశం కల్పించడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.ఈ అధ్యయన యాత్రలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరు నాగయ్య, జిల్లా కమిటీ సభ్యుడు జి. పెంచలయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టి. త్రివిక్రమ్‌తో పాటు గ్రామస్తులు పి. వెంకటేశ్వర్లు, టి. యాకోబు, పెంచల నరసయ్య, పోలిపోగు నరసయ్య, దండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


