Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంతా భ్రాంతియేనా ….ఆశా నిరాశేనా? : చివరకు మిగిలిందింతేనా ?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అంతా భ్రాంతియేనా ….ఆశా నిరాశేనా? : చివరకు మిగిలిందింతేనా ?

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరులో వైసీపీ ఓటమికి అనేక కారణాలు ---ప్రజల హృదయాలను గెలవలేకపోవడమే ఐక్యతలో వెనుకడుగు – వ్యూహరచనలు లేని వైసీపీ నేతలు – ప్రణాళికలు కరువు – ఆర్థిక సరఫరాలో వెనుకడుగు – బలహీనమైన నేతలను బరిలో దింపడం కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లుగా ఉమ్మడి నెల్లూరు…
  • మొదటి నుంచి వైసీపీ ఈ ఎన్నికల్లో తప్పటడుగులు వేస్తూనే ఉంది.
  • బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి అనేక చోట్ల దింపడం పెద్ద తప్పుగా ఉంది.

నెల్లూరులో వైసీపీ ఓటమికి అనేక కారణాలు
—ప్రజల హృదయాలను గెలవలేకపోవడమే ఐక్యతలో వెనుకడుగు
– వ్యూహరచనలు లేని వైసీపీ నేతలు
– ప్రణాళికలు కరువు
– ఆర్థిక సరఫరాలో వెనుకడుగు
– బలహీనమైన నేతలను బరిలో దింపడం
కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి నుంచి వైసీపీ ఈ ఎన్నికల్లో తప్పటడుగులు వేస్తూనే ఉంది. బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి అనేక చోట్ల దింపడం పెద్ద తప్పుగా ఉంది. ఎన్నికల బరిలో పోరాటం చేయలేని సైనికులను దింపి వైసీపీ ఉమ్మడి జిల్లాలో బలహీనంగా మారింది.
తమ ప్రసంగాలతో, ప్రకటనలతో ప్రజా హృదయాలను చేరుకోలేకపోయింది. ఆర్థిక సరఫరాలో తమ శత్రువైన కూటమి అభ్యర్థులతో సరితూగలేక చతికిలపడింది. ఓ వైపు కూటమి అభ్యర్థులు జిల్లాలో కట్టలు తెంపుతుంటే, మరోవైపు ఆ కట్టలు తెంపడంలో వైసీపీ బాగా వెనుకపడింది.
ఒక్క నాయుడుపేటలోనే వైసీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ మాత్రం ఎన్నికల యుద్ధాన్ని చివరి వరకు చేసి ఓడి గెలిచింది. మిగతా మున్సిపాలిటీల్లో వైసీపీ అభ్యర్థుల పోరాటం అనేక చోట్ల అంతంతమాత్రంగానే కనిపించింది.
మరి నెల్లూరు నగరంలో అయితే వైసీపీ ఆది నుంచి అధిక తప్పులు చేస్తూనే ఉంది. అనేక చోట్ల ఊరు పేరు లేని, ప్రజా హృదయాలను గెలుచుకోలేని అభ్యర్థులను రంగంలో దింపి ఓటమి పాలైంది. నెల్లూరు నగరంలో కొన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారే తప్ప ప్రచార పర్వంలో ఆసక్తిగా పాల్గొనలేదు. అసలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికీ తిరిగి అభ్యర్థించడం లో కూడా వారు చాలా వెనుకబడ్డారు.

ఇక ఓటర్లకు ఆర్థిక సరఫరా అందించి వారిని ప్రసన్నం చేసుకోవడం అనే ప్రధాన ఘట్టంలో చతికిలపడ్డారు. కొన్ని డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు అసలు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితులు ఓటర్లలో నెలకొన్నాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఊహించుకోవచ్చు.
మరోవైపు సాక్షాత్తూ మేయర్ అభ్యర్థి కూడా ఎన్నికలను వివేకవంతంగా నిర్వహించలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నెల్లూరు నగరంలో వైసీపీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన అనం విజయకుమార్ రెడ్డి సొంత డివిజన్, సొంత 5వ డివిజన్‌లో కూడా టీడీపీ అభ్యర్థి ఇంగిలేల అబ్రహం విజయం సాధించారు. అంటే ఇంతకంటే దారుణం మరెక్కడా కనిపించలేదు.
అలాగే వైసీపీ ఎమ్మెల్సీగా పనిచేస్తూ నెల్లూరు సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 21వ డివిజన్‌లో కూడా జనసేన అభ్యర్థి గునుకుల విజయలక్ష్మి విజయం సాధించారు. అంటే ఆయన వ్యూహాలు ఎంతగా చతికిలపడ్డాయో అర్థం చేసుకోవచ్చు.
జిల్లా వైసీపీలో ఉన్న వర్గపోరు కూడా ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మాజీ మంత్రి పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్‌కు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనూ, అటు నెల్లూరు రూరల్‌లోనూ కొంత పట్టు ఉంది. ఆయనను ఎన్నికల రణక్షేత్రంలోకి రప్పించి, ఆయన చేత, ఆయన వర్గం చేత పని చేయించుకోవడంలో జిల్లా వైసీపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారు. వైసీపీ ఓటమికి దీన్ని కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
అభ్యర్థులను నిర్ణయించడంలో, ముఖ్యంగా సిటీ నియోజకవర్గంలో ఎన్నో అవకతవకలు జరిగాయి. సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అహంకారానికి వెళ్లి అనిల్ కుమార్ వర్గీయులను దూరంగా పెట్టడం, తన వర్గానికి చెందిన వారికే ముందు వెనుక ఆలోచించకుండా బలహీనమైన అభ్యర్థులకు డివిజన్ టికెట్లు ఇవ్వడం ఘోర పరాజయానికి దారితీసింది.

జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నగరంలో అక్కడక్కడా ప్రచారంలో పాల్గొన్నా, ఆయన తన పూర్తి స్థాయి సామర్థ్యాన్ని చూపలేకపోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి సరైన గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడంతో ఆయన ఈ ఎన్నికల క్షేత్రంలో అస్త్ర సన్యాసం చేసినట్లు వార్తలు వినిపించాయి.
వైసీపీలోనే ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్న నేతలు అధికార పార్టీ అధికారానికి జడిసి ఎన్నికల క్షేత్రంలో బహిరంగంగా పని చేయలేదు.
నగరంలో దశాబ్దాల చరిత్ర ఉన్న అనం కుటుంబాన్ని చీల్చి, దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కూటమి సఫలీకృతం కాగా, వైసీపీ అనం అభిమానులను కూడగట్టడంలో విఫలమైంది.
ఓ వైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నగరంలో కూటమి విజయానికి కృషి చేయగా, స్వర్గీయ అనం వివేకానంద రెడ్డి రంగ మయూర్ రెడ్డికి టీడీపీ డివిజన్ టికెట్ ఇచ్చి గెలిపించుకొని అనం వర్గాన్ని మూడు వంతుల భాగం తమ ఖాతాలో జమ చేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ వైఫల్యాలు నగర ఎన్నికల్లో కొల్లలుగా కనిపిస్తున్నాయి.
అనుభవజ్ఞులైన మేధావుల, రాజకీయ విశ్లేషకుల సూచనలు, సలహాలు తీసుకోవడంలో వైసీపీ నేతలైన అభ్యర్థి అనం విజయకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిలు పూర్తిగా విఫలమయ్యారు. ముక్కుసూటితనంతో వెళ్లే పై ఇరువురు నేతల రాజకీయ అస్త్రాలు నామినేషన్ల పరిశీలనలోనే ఫెయిల్ అయ్యాయి. వారి ఫెయిల్సే తొలుత 8 వార్డులు ఏకగ్రీవానికి దారి తీసాయి.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *