*మొద్దు నిద్రలో సెంట్రల్ డ్రైనేజీ కాంట్రాక్టర్*
*వివరణ కోరేందుకు ఫోన్ చేసినా స్పందించని అధికారులు*
*మూడు నెలలుగా పూర్తి కాని పనులు నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు, వాహనదారులు*
జులై 22 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
మధిర:
మధిర పట్టణంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గెస్ట్ హౌస్ నుంచి బైపాస్ రోడ్ మీదుగా ఎన్జీవోస్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై చేపట్టిన సెంట్రల్ డ్రైనేజీ పనులు మూడు నెలలు గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ప్రారంభించిన తర్వాత రహదారిని తవ్వి అలాగే వదిలేయడంతో ప్రభుత్వం అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాల కారణంగా తవ్విన రహదారిలో నీరు నిలిచి బురదమయంగా మారడంతో ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు జారిపడి ప్రమాదాలకు గురవుతుండగా, అత్యవసర సేవల వాహనాలు సైతం ఈ రహదారిలో ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఎన్జీవోస్ కాలనీ, ముస్లిం కాలనీ, హనుమాన్ కాలనీ ప్రాంతాల ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులను వేగంగా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా సాగదీస్తున్న కాంట్రాక్టర్ తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై వివరణ కోరేందుకు పలుమార్లు సంబంధిత ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్కు ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ నిర్లక్ష్యంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సెంట్రల్ డ్రైనేజీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రహదారిని వాహనాల రాకపోకలకు అనువుగా మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


