పోలవరం, జూలై 17 (పున్నమి ప్రతినిధి): పోలవరం ప్రాజెక్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ శాసనమండలి పక్షనేత సోము వీర్రాజుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై అధికారులు మ్యాప్ ఆధారంగా వివరించారు. కుడి, ఎడమ కాలువల నిర్మాణం, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఇప్పటివరకు చేపట్టిన పనులు, మిగిలిన నిర్మాణ కార్యక్రమాలపై బీజేపీ నేతలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇరిగేషన్ టన్నెల్ పనులు మరో నెల రోజుల్లో పూర్తవుతాయని, రెగ్యులేటర్‌కు సంబంధించిన కొన్ని పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. అలాగే రూ.2,800 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టును బీజేపీ నేతలు పరిశీలించారు. ప్రస్తుతం తొలి యూనిట్ పనులు కొనసాగుతున్నాయని, మొత్తం పవర్ ప్రాజెక్టు ఏడాది వ్యవధిలో పూర్తవుతుందని అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.


