పాత్రికేయుల డిమాండ్లు పరిష్కరించాలి
గాంధీ విగ్రహం ముందు టియూడబ్ల్యూజే
ఆధ్వర్యంలో ‘డిమాండ్స్ డే’
ఆర్డీవో ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం
నిర్మల్
దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్లు పరిష్కరించాలని ఐజేయూ పిలుపుమేరకు టియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్బంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు కొండూరి రవిందర్ , ప్రధాన కార్యదర్శి భూమయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుండి గాంధీ పార్క్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీ పార్క్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. మహాత్ముని విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. డిమాండ్స్ డే నిరసన చేపట్టి, ఆర్డీవో దేవిదాస్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు కొండూరి రవీందర్ మాట్లాడుతూ… జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ‘పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం’గా పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.
సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ రంగాన్ని సమగ్రంగా సమీక్షించి, ఆధునిక యుగానికి అనువైన విధాన సిఫార్సులను రూపొందించడానికి ఒక కొత్త మీడియా కమిషన్ను ఏర్పాటు చేయడం అత్యవసరమన్నారు.
పాత్రికేయులు, మీడియా సంస్థల భద్రత కోసం ఒక ప్రత్యేక కేంద్ర చట్టాన్ని రూపొందించాలన్నారు.
పత్రికా రంగం భారత ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా పనిచేస్తుంది. స్వతంత్ర, సురక్షితమైన మీడియా వాతావరణం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి పునాది. శారీరక దాడులు, ఏకపక్ష నిర్బంధాలు, ఆన్లైన్ వేధింపులు, సంస్థాగత బెదిరింపులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. మీడియా సిబ్బంది తమ విధులను నిర్భయంగా నిర్వర్తించేలా చూడటానికి, కేంద్ర ప్రభుత్వం పాత్రికేయులను, మీడియా సిబ్బందిని, వార్తా సంస్థలను హింస, అనుచిత అణచివేత నుండి కాపాడే ఒక పటిష్టమైన, స్వతంత్ర జాతీయ చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 1955, 1958 చట్టాల కింద మొదటగా హామీ ఇవ్వబడిన ప్రత్యేక రక్షణలను తక్షణమే పునరుద్ధరించాలని కోరారు.
మీడియా ఉద్యోగుల కోసం రెండు దశాబ్దాల క్రితం, 2007లో ఏర్పాటు చేయబడింది. జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగినప్పటికీ, ప్రభుత్వ, కార్పొరేట్ రంగాలలో జీతాలు ఎప్పటికప్పుడు సవరించబడుతున్నప్పటికీ, మీడియా కార్మికులకు చట్టబద్ధమైన వేతన నవీకరణలు అందలేదు. ముద్రణ, ప్రసార మరియు డిజిటల్ మీడియా సిబ్బందిని కలుపుకొని, న్యాయమైన, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేయబడిన పరిహార నిర్మాణాలను సిఫార్సు చేయడానికి ఒక కొత్త వేతన మండలిని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
రాష్ట్రంలో జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ళు, ఇళ్లస్థలాల సమస్య పరిష్కరించడంతోపాటు ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని, జర్నలిస్టులపై నిత్యం జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తగిన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కు మద్దతుగా సీపీఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య, నిర్మల్ జిల్లా కార్యదర్శి కె.రాజన్న, పిడిఎస్యూ జిల్లా కార్యదర్శి కిరణ్, బిసి ఎస్సి ఎస్టీ సంఘం జిల్లా అధ్యక్షులు వై. సాయన్న, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామగిరి రవీందర్, ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ హైదర్ మద్దతుగా నిరసనలో పాల్గొని వారి గళం విప్పారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కౌన్సిల్ గాండ్ల రాజశేఖర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సోమ ప్రమోద్ రెడ్డి, జిల్లా కోశాధికారి ప్రశాంత్, ఉపాధ్యక్షులు మనోజ్, వేణు, అశోక్, రవీందర్, సంయుక్త కార్యదర్శి హనుమాండ్లు, జిల్లా కమిటీ సభ్యులు మధు, రవి కుమార్, రాజేశం, లింగేష్, షిండే మహేష్, గౌతమ్, ఖానాపూర్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు సట్ల శంకర్, కైసర్, శాంకేత్, పర్వేజ్, సాజిద్, రాకేష్, ఉస్మాన్ ,శ్రీనివాస్ తదితరులున్నారు


