వార్త ముఖ్యాంశాలు
- – ఓటర్లకు సకాలంలో అందని స్లిప్‌లు --సమీపిస్తున్న మునిసిపల్ ఎన్నికల పోలింగ్ – ఆందోళనలో నగర ఓటర్లు నవంబర్ 1వ తేదీన నెల్లూరు నగర మేయర్ స్థానానికి పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం వచ్చినా, పోలింగ్ సమయం సమీపిస్తున్నా ఇప్పటివరకు నెల్లూరు నగర పరిధిలో…
- సంబంధిత బీఎల్ఓల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోందని పలువురు ఓటర్లు ఆరోపిస్తున్నారు.
- తమ ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో తెలియని పరిస్థితుల్లో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
– ఓటర్లకు సకాలంలో అందని స్లిప్‌లు
–సమీపిస్తున్న మునిసిపల్ ఎన్నికల పోలింగ్
– ఆందోళనలో నగర ఓటర్లు
నవంబర్ 1వ తేదీన నెల్లూరు నగర మేయర్ స్థానానికి పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం వచ్చినా, పోలింగ్ సమయం సమీపిస్తున్నా ఇప్పటివరకు నెల్లూరు నగర పరిధిలో ఓటర్ స్లిప్‌ల పంపిణీ కార్యక్రమం మందకొడిగా కొనసాగుతున్నట్లు సమాచారం. సంబంధిత బీఎల్ఓల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోందని పలువురు ఓటర్లు ఆరోపిస్తున్నారు. తమ ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో తెలియని పరిస్థితుల్లో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ఓటర్ స్లిప్‌లు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలింగ్ రోజు కూడా వారికి సంబంధించిన బీఎల్ఓలను సంప్రదించి స్లిప్‌లు పొందవచ్చని సహాయ ఎన్నికల అధికారి, నగర కమిషనర్ వై.ఓ. నందన్ చెబుతున్నా, ఆ మాటలు ఓటర్లకు తలకెక్కడం లేదు. అసలు తమ ఓటు ఏ బూత్‌లో ఉంది, తమ నంబర్ ఎంత అనే విషయంపై ఓటర్లు అర్థం కాక తర్జనభర్జన పడుతున్నారు.
ముఖ్యంగా సిటీ నియోజకవర్గ పరిధిలోని 36 డివిజన్లలో 15 నుంచి 20 డివిజన్ల పరిధిలో ఈ సమస్య ప్రస్తుతం పెద్దదిగా కనిపిస్తోంది. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో బీఎల్ఓలు సమాధానాలు చెప్పడం లేదని కొందరు ఓటర్లు ఆరోపిస్తున్నారు. అసలు వీధివీధికి, ఇంటింటికీ తిరిగి సంబంధిత ఓటర్ల స్లిప్‌లను ఆయా కుటుంబ సభ్యులకు అందజేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియ కొనసాగడం లేదని ఓటర్లు ఆరోపిస్తున్నారు. తామే చొరవ తీసుకొని సంబంధిత వార్డు సచివాలయాల కార్యాలయాలకు వెళ్లినా, అక్కడ కూడా సమాధానాలు చెప్పేవారు కరువయ్యారని ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు.
అనేక పోలింగ్ బూత్‌లకు చెందిన బీఎల్ఓల నిర్లక్ష్య వైఖరి తమకు అశనిపాతంగా మారిందని అనేక చోట్ల ఓటర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 8, 9 తదితర డివిజన్లలో, అలాగే పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న సచివాలయాల్లో ఈ పరిస్థితి మెండుగా కనిపిస్తోందని ఓటర్లు చెబుతున్నారు. పోలింగ్‌కు ఇంకెంతో సమయం లేదని, ఇప్పటివరకు స్లిప్‌లు పంచలేదని, ఇలాగే మరో 25 గంటలు గడిస్తే పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని ఓటర్లు అంటున్నారు.
అసలు ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోందా? ఇందులో అధికార పార్టీకి చెందిన నేతల ఆదేశాలు, మాయమర్మాలు ఏవైనా ఉన్నాయా? అన్న సందేహాలను కూడా ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తున్నా ఇప్పటివరకు 50 శాతం స్లిప్‌లు కూడా సంబంధిత బీఎల్ఓలు సక్రమంగా పంచలేదంటే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ ఓటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి, యుద్ధప్రాతిపదికన బీఎల్ఓల సిబ్బందిని పెంచైనా సరే, 31వ తేదీ సాయంత్రానికి నూటికి నూరు శాతం ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేసి, సంబంధిత ఓటర్లను ఆందోళనల నుంచి దూరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్