జి.కొండూరు అభివృద్ధికి కూటమి అభ్యర్థితోనే భరోసా.
పజ్జూరు విజయకుమార్‌ను గెలిపించండి.
-మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.
కేంద్రం నుంచి గ్రామం వరకు కూటమి పాలనతోనే అభివృద్ధికి సమన్వయం.
కత్తెర గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి.
జి.కొండూరులో భారీ ర్యాలీ.
ఎమ్మెల్యే వసంతకు గ్రామస్తుల ఘన స్వాగతం.
పసుపుమయంగా మారిన గ్రామ వీధులు.
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 24/11/2026.
జి.కొండూరు గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థి పజ్జూరు విజయకుమార్‌ను గెలిపించాలని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీరాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను ఉన్నానని, స్థానికంగా కూడా కూటమి అభ్యర్థి ఎన్నికైతే అన్ని స్థాయిల్లో సమన్వయంతో గ్రామానికి మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
మంగళవారం జి.కొండూరు గ్రామంలో కూటమి సర్పంచ్ అభ్యర్థి పజ్జూరు విజయకుమార్‌కి మద్దతుగా నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు హారతులు పట్టి ఎమ్మెల్యేకు, సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు అభివాదం చేస్తూ తమ మద్దతు ప్రకటించడంతో గ్రామమంతా పసుపుమయంగా మారింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పజ్జూరు విజయకుమార కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను తీసుకురావడానికి తాను సంపూర్ణంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జి.కొండూరు మండల జెడ్పీటీసీగా రేవతి చంద్రిక గారిని, ఎంపీపీగా కూటమి అభ్యర్థిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించారని గుర్తుచేశారు. పైస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉంటే అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతాయని వివరించారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కోటి మంది సభ్యులు ఉన్నారని, మైలవరం నియోజకవర్గంలోనే సుమారు 70 వేల మంది పార్టీ సభ్యులు ఉన్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారని, అయితే అవకాశాలు పరిమితంగా ఉండటంతో అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాదన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, 73 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయగా 62 స్థానాల్లో విజయం సాధించామని, కొండపల్లి మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 33 వార్డులను కూటమి కైవసం చేసుకుందని వెల్లడించారు.
ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ తల్లికి వందనం ద్వారా పాఠశాలకు వెళ్లే పిల్లలకు, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతోందని పేర్కొన్నారు. గతంలో 2019 నుంచి 2024 వరకు తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), ఎల్ఓసీల ద్వారా సుమారు రూ.5 కోట్ల సహాయం అందించామని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రెండోసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 25–26 నెలల వ్యవధిలోనే అనారోగ్య సమస్యలు, ప్రమాదాల బారినపడిన బాధితులకు రూ.32 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించామని వివరించారు. అర్హులైన పేద కుటుంబాలకు వైద్య చికిత్స కోసం ఆర్థిక భారం పడకుండా సహాయం అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలవుతున్నాయని తెలిపారు.
జి.కొండూరు గ్రామంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, గ్రామ శ్మశానవాటికకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేదని ప్రజలు కోరడంతో రూ.75 లక్షలు కేటాయించి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. కొత్తూరుకు రహదారి కావాలన్న ప్రజల విజ్ఞప్తి మేరకు కొత్త రోడ్డును మంజూరు చేయించి పనులు పూర్తి చేయించామని వెల్లడించారు. ఇంకా గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని, పజ్జూరు విజయకుమార్ గారిని గెలిపిస్తే వాటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ప్రజలు తమ ఓటు విలువను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కోరారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులను ఎమ్మెల్యేగా తాను తీసుకువస్తానని, జెడ్పీటీసీ సభ్యురాలు రేవతి గారు జిల్లా పరిషత్ నిధులు, మండల స్థాయి నుంచి రావాల్సిన నిధులను కూడా సమన్వయం చేసుకుని జి.కొండూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
గ్రామ ప్రజల ఆశీస్సులు, కూటమి నాయకులు, కార్యకర్తల సహకారంతో పజ్జూరు విజయకుమార్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పిలుపునిచ్చారు. భారీ ర్యాలీతో జి.కొండూరులో కూటమి ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా సాగింది.

