వార్త ముఖ్యాంశాలు
- ‘మధుమేహం (షుగర్) రాజధాని’గా ఇప్పటికే కిరీటాన్ని తగిలించుకున్న మన దేశం, ఇప్పుడు ‘నోటి క్యాన్సర్ రాజధాని’గానూ అగ్రపీఠం ఎక్కింది.
- ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే మొత్తం నోటి క్యాన్సర్ కేసుల్లో దాదాపు మూడో వంతు (సుమారు 30–33 శాతం) మన దేశంలోనే బయటపడుతున్నాయి.
- ఏటా దాదాపు 1.4 లక్షలకు పైగా కొత్త కేసులు, 80 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.
‘మధుమేహం (షుగర్) రాజధాని’గా ఇప్పటికే కిరీటాన్ని తగిలించుకున్న మన దేశం, ఇప్పుడు ‘నోటి క్యాన్సర్ రాజధాని’గానూ అగ్రపీఠం ఎక్కింది. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే మొత్తం నోటి క్యాన్సర్ కేసుల్లో దాదాపు మూడో వంతు (సుమారు 30–33 శాతం) మన దేశంలోనే బయటపడుతున్నాయి. ఏటా దాదాపు 1.4 లక్షలకు పైగా కొత్త కేసులు, 80 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.
విషాదం ఏమిటంటే—ఈ దారుణ పరిస్థితి ప్రకృతి వైపరీత్యమో లేదా తప్పించుకోలేని శాపమో కాదు; పైసలు ఖర్చుపెట్టి మన చేజేతులా కొనితెచ్చుకుంటున్న విపత్తు!
పాశ్చాత్య దేశాల్లో సిగరెట్లు, సిగార్ల వంటి ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగితే, మన దగ్గర మాత్రం ‘నమిలే పొగాకు’ నేరుగా దవడలనే మింగేస్తోంది. గుట్కా, ఖైనీ, జర్దా, పాన్ మసాలా వంటి రూపాల్లో పొగాకును దవడ కింద చేర్చి గంటల తరబడి బుగ్గన దాచుకోవడమే ఈ మహమ్మారికి ప్రధాన కారణం.
పొగాకు అంటే కేవలం ఒక ఆకు కాదు; అది దాదాపు 77 రకాల ప్రత్యక్ష క్యాన్సర్ కారక (Carcinogenic) రసాయనాల విషపు భాండాగారం. నికోటిన్, నైట్రోసమైన్లు, ఆర్సెనిక్, సీసం వంటి విషాలు దవడ లోపలి సున్నితమైన పొరలను క్రమంగా కాల్చేస్తాయి. దానికితోడు సున్నం, వక్క పొడి ఘర్షణ తోడైతే—మొదట నోరు తెరవడం కష్టమయ్యే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’, తెల్ల/ఎర్ర మచ్చలు (ల్యూకోప్లాకియా) మొదలై, చివరకు ప్రాణాంతక క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతాయి.
అయితే, ఈ విష వలయానికి ఒక గొప్ప ఆశాకిరణం కూడా ఉంది. ఈ క్షణమే పొగాకు అలవాటుకు స్వస్తి పలికితే… రాబోయే 5 ఏళ్లలోనే నోటి క్యాన్సర్ ముప్పు 50 శాతానికి పడిపోతుంది. 10 నుంచి 15 ఏళ్లలో సాధారణ ఆరోగ్యవంతుడితో సమాన స్థాయికి చేరుకోవచ్చు.
బుగ్గన విషాన్ని దాచి ప్రాణాన్ని పణంగా పెట్టే ఈ ‘నమిలే మౌఢ్యాన్ని’ వీడదాం. పొగాకును శాశ్వతంగా ఉమ్మేసి, సంపూర్ణ ఆరోగ్యాన్ని నవ్వుతూ స్వాగతిద్దాం!
- డాక్టర్ ఎం. వి. రమణయ్య,
డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల,
రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్