Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

సొంత ప్రభుత్వంపైనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు స్వరం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సొంత ప్రభుత్వంపైనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు స్వరం!

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

సొంత ప్రభుత్వంపైనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు స్వరం!

మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై ఘాటు విమర్శలు.. నిధుల కేటాయింపులో వివక్ష జరుగుతోందని ఆరోపణలు

బీఆర్ఎస్ హయాంలో పూడికతీత చేసిన చెరువుల్లో నేడు నీళ్లు.. రైతులకు ఉపయోగపడుతున్నాయంటూ వ్యాఖ్యలు

మునుగోడు, నవంబర్ 3:

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి మరోసారి బహిర్గతమైంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సొంత ప్రభుత్వంపై, ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూడికతీత చేసిన చెరువుల్లో ప్రస్తుతం నీళ్లు నిలిచి రైతులకు ఉపయోగపడుతున్నాయని పేర్కొంటూ గత ప్రభుత్వ పనులను ప్రస్తావించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ”ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏం మంత్రి అయ్యా.. ఆయన హుజూర్‌నగర్‌కే మంత్రా? లేక తెలంగాణ రాష్ట్రానికే మంత్రా? నిధులన్నీ కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాలకే తీసుకెళ్తున్నారు. మిగతా నియోజకవర్గాలకు నిధులు ఎందుకు కేటాయించడం లేదు?” అంటూ ప్రశ్నించారు.

అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరిగా నిధుల కోసం పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిని కాకపోవచ్చు, మంత్రిని కాకపోవచ్చు కానీ గుణంలో వారికంటే వంద రెట్లు గొప్పవాడినని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌లో అంతర్గత చర్చకు దారితీసిన వ్యాఖ్యలు

ఒకవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చెరువుల పూడికతీత పనుల వల్ల ప్రస్తుత వర్షాకాలంలో నీటి నిల్వలు పెరిగి రైతులకు ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే చెప్పడం, మరోవైపు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యతతో అభివృద్ధి నిధులు కేటాయించాలనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. అధికార పార్టీలోని ఎమ్మెల్యేనే ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Uploaded Video:

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *