వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు, అక్టోబర్ 26 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): కుటుంబ వారసత్వంగా వచ్చిన ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆత్మకూరు పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న లక్ష్యంతో రాజకీయంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు టీడీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, యువ నాయకుడు బొమ్మిరెడ్డి…
- వైద్యం, విద్య, తాగునీటి రంగాల్లో తమ కుటుంబం గతంలో చేపట్టిన సేవలను కొనసాగించడంతో పాటు, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పట్టణంలో మౌలిక వసతులను మెరుగుపరచడమే తమ ఆకాంక్షగా పేర్కొన్నారు.
- సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన డాక్టర్ షకీలా..
ప్రజాసేవే ధ్యేయంగా రాజకీయ నిర్ణయం.. టీడీపీ వైపు బొమ్మిరెడ్డి కుటుంబం అడుగులు
వైద్యం, విద్య, తాగునీటి రంగాల్లో గత సేవల స్ఫూర్తి.. ఆనం నాయకత్వంలో పట్టణ ప్రగతికి కృషి
ఆత్మకూరు, అక్టోబర్ 26 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): కుటుంబ వారసత్వంగా వచ్చిన ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆత్మకూరు పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న లక్ష్యంతో రాజకీయంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు టీడీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, యువ నాయకుడు బొమ్మిరెడ్డి తారకనాథ్రెడ్డి తెలిపారు. వైద్యం, విద్య, తాగునీటి రంగాల్లో తమ కుటుంబం గతంలో చేపట్టిన సేవలను కొనసాగించడంతో పాటు, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పట్టణంలో మౌలిక వసతులను మెరుగుపరచడమే తమ ఆకాంక్షగా పేర్కొన్నారు.
సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన డాక్టర్ షకీలా.. రాజకీయాల్లోకి రావాలనే ప్రత్యేక ఆసక్తి తనకు మొదట్లో లేదని, ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అంగీకరించినట్లు తెలిపారు. తొలుత కుటుంబ సభ్యురాలు గీతిక పేరును పరిశీలించిన అనంతరం తన పేరును ఖరారు చేయడంతో చివరకు సమ్మతించినట్లు వివరించారు. దుర్గాష్టమి పూజకు ముందు రోజు రాత్రి ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు.
ప్రజలకు నేరుగా సహాయం చేయాలన్న ఆలోచన తనకు మొదటి నుంచీ ఉందని షకీలా తెలిపారు. నెలకు కొంత మొత్తాన్ని పట్టణ ప్రజల అవసరాలకు ఖర్చు చేయాలని భావించానని, మొదట రూ.50 వేలు అనుకున్నప్పటికీ కనీసం రూ.20 వేలైనా ప్రజాసేవకు వినియోగించాలని ఆలోచించినట్లు చెప్పారు. అయితే ప్రజాప్రతినిధిగా బాధ్యతలు చేపడితే వ్యక్తిగత సహకారంతో పాటు ప్రభుత్వ పథకాలు, నిధులను సమన్వయం చేసి మరింత మందికి సేవ చేసే అవకాశం ఉంటుందన్న సూచనతో ఎన్నికల్లో పోటీకి అంగీకరించినట్లు వివరించారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిశీలించి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
పేదలకు వైద్య సహాయం అందించడమే కాకుండా, ఉచితంగా లేదా రాయితీతో అందించే సేవలకు క్రమబద్ధమైన రికార్డులు నిర్వహించాలని షకీలా అభిప్రాయపడ్డారు. అర్హులకు ఆరోగ్య కార్డులు అందించడం, సేవలను నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని నిధులు సమకూర్చుకుని ఎక్కువ మందికి సహాయం చేయవచ్చని తెలిపారు. గతంలో పేదలు, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అక్షరాస్యత పెంపునకు అక్షరదీపం కార్యక్రమం ద్వారా వాలంటీర్లను నియమించి రాత్రి పాఠశాలల్లో విద్యాబోధన చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. బోధకులకు పారితోషికాలు అందిస్తూ నిరక్షరాస్యులకు చదువును చేరువ చేసేందుకు ప్రయత్నించినట్లు వివరించారు.
కుటుంబ వారసత్వం.. ప్రజాసేవే ప్రేరణ
దివంగత డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి, దివంగత డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన సేవా కార్యక్రమాల స్ఫూర్తితోనే రాజకీయంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తారకనాథ్రెడ్డి తెలిపారు. కుటుంబంలో వ్యక్తిగత విభేదాలు తమ నిర్ణయానికి కారణం కాదని, ఆత్మకూరు అభివృద్ధికి ఉపయోగపడే మార్గాన్ని ఎంచుకోవాలన్న ఆలోచనతోనే రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
గతంలో తన బాబాయి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తన తల్లిని వైఎస్సార్సీపీ తరఫున ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారని, అయితే రాజకీయాలపై ఆసక్తి లేదని ఆమె పలుమార్లు చెప్పినట్లు తారకనాథ్రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఎంతో గౌరవంగా తమను ఆహ్వానించి, టీడీపీ తరఫున పోటీ చేయాలని కోరడంతో నిర్ణయం మారిందన్నారు.
తన తాతయ్య తర్వాత ఆత్మకూరు అభివృద్ధికి ఆనం రామనారాయణరెడ్డి చేసిన కృషి, ఆయన నాయకత్వంలో కనిపించిన ప్రగతి తమను టీడీపీ వైపు ఆకర్షించాయని పేర్కొన్నారు. కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా పట్టణ అభివృద్ధికి ఉపయోగించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇకపై ఆనం నాయకత్వంలో ఆత్మకూరు అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములమై, పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
వైద్యం, విద్య, తాగునీటికి ప్రాధాన్యం
తమ కుటుంబం గతంలో చేపట్టిన వైద్య సేవలను తారకనాథ్రెడ్డి వివరించారు. దివంగత డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిని 10 పడకల స్థాయి నుంచి 30 పడకల స్థాయికి విస్తరించడంలో కీలక పాత్ర పోషించారని, అనంతరం డాక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి హయాంలో ఆసుపత్రి 100 పడకల స్థాయికి చేరిందని తెలిపారు. మైదూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు, వెల్లూరులో పశువైద్యశాల, ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు వంటి కార్యక్రమాలను గుర్తుచేశారు. ట్రస్టు ద్వారా పేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
వైద్య రంగంతో పాటు విద్య, తాగునీటి రంగాల్లోనూ తమ కుటుంబం గతంలో కృషి చేసిందన్నారు. పాఠశాలలకు కొత్త భవనాలు మంజూరు చేయించేందుకు ప్రయత్నించడం, ఆత్మకూరు పట్టణంలో తాగునీటి సరఫరా మెరుగుదలకు పథకాలు, జూనియర్ కళాశాలకు భవనాల మంజూరు, టెలిఫోన్ కనెక్షన్ల విస్తరణ వంటి అంశాలను వివరించారు. గతంలో చేపట్టిన ఈ కార్యక్రమాల స్ఫూర్తితో ప్రస్తుత అవసరాలను గుర్తించి, పట్టణానికి అవసరమైన వసతుల కల్పనకు కృషి చేయాలన్నది తమ ఆకాంక్షగా పేర్కొన్నారు.
మున్సిపాలిటీ స్థాయికి తగిన ప్రగతి రావాలి
ఆత్మకూరు మున్సిపాలిటీగా మారినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా పాత పంచాయతీ కాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని తారకనాథ్రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కొన్ని కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ జనాభా, ప్రజల అవసరాలకు అనుగుణంగా సదుపాయాలను మెరుగుపరిచి, మున్సిపాలిటీ స్థాయికి తగిన ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు.
ప్రజల సమస్యలను గుర్తించి, ప్రభుత్వ పథకాలు, అందుబాటులో ఉన్న నిధులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. కుటుంబం నుంచి వచ్చిన ప్రజాసేవా వారసత్వాన్ని కొనసాగిస్తూ, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నాయకత్వంలో ఆత్మకూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని డాక్టర్ షకీలా, తారకనాథ్రెడ్డి తెలిపారు.

