వార్త ముఖ్యాంశాలు
- మన గుండె ప్రతిరోజూ క్షణం తీరిక లేకుండా, రోజుకు సుమారు లక్ష సార్లు కొట్టుకుంటూ మనల్ని బతికిస్తోంది.
- కానీ గుండెకు తెలియకుండానే మన ఒంట్లో తిష్టవేసిన ఇద్దరు దొంగలకు తోడుగా, బయటి నుంచి మరో దొంగ వచ్చి చేరుతాడు.
- ఈ ముగ్గురు దొంగలూ స్నేహితులై నెమ్మదిగా మన గుండె ఆరోగ్యాన్ని దోచుకుంటారు.
మన గుండె ప్రతిరోజూ క్షణం తీరిక లేకుండా, రోజుకు సుమారు లక్ష సార్లు కొట్టుకుంటూ మనల్ని బతికిస్తోంది.
కానీ గుండెకు తెలియకుండానే మన ఒంట్లో తిష్టవేసిన ఇద్దరు దొంగలకు తోడుగా, బయటి నుంచి మరో దొంగ వచ్చి చేరుతాడు. ఈ ముగ్గురు దొంగలూ స్నేహితులై నెమ్మదిగా మన గుండె ఆరోగ్యాన్ని దోచుకుంటారు.
ఈ దొంగలు ఎవరో తెలుసా?
మొదటి దొంగ — షుగర్ (మధుమేహం)
ఈ దొంగ చాలా తెలివైనవాడు…
నొప్పి కలిగించడు, పెద్దగా శబ్దం చేయడు. అందుకే చాలామంది దీన్ని తేలికగా తీసుకుంటారు.
కానీ రక్తంలో షుగర్ ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే రక్తనాళాలు దెబ్బతింటాయి. దాంతో గుండెపోటు, పక్షవాతం (స్ట్రోక్) వంటి తీవ్ర సమస్యల ముప్పు పెరుగుతుంది.
అందుకే షుగర్ కంటికి కనిపించకపోయినా, దాని దుష్ప్రభావం గుండెపై స్పష్టంగా పడుతుంది. కేవలం షుగర్ మాత్రమే ఉన్నవారికి గుండెపోటు ముప్పు సాధారణ వ్యక్తుల కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువ!
రెండో దొంగ — బీపీ (రక్తపోటు)
ఈ దొంగ మరింత విచిత్రమైనవాడు. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలూ కనబడనీయడు.
“నాకు ఏమీ అనిపించడం లేదు కదా!” అని మనల్ని భ్రమలో ముంచుతాడు.
అందుకే అధిక రక్తపోటును “సైలెంట్ కిల్లర్” (నిశ్శబ్ద హంతకుడు) అంటారు. బీపీ ఎక్కువగా ఉంటే గుండెపై అధిక ఒత్తిడి పడుతుంది. కాలక్రమంలో రక్తనాళాలు దెబ్బతింటాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే బీపీ ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం 2 నుంచి 3 రెట్లు ఎక్కువ.
👉 బీపీ, షుగర్ రెండూ జతకడితే గుండెపోటు వచ్చే ముప్పు సుమారు 5 రెట్లు పెరుగుతుంది!
మూడో దొంగ — ధూమపానం (పొగతాగడం)
ఇతను అత్యంత ప్రమాదకరమైన దొంగ… గుండెకు బహిరంగ శత్రువు!
“ఒక్క సిగరెట్టే కదా…” అని మొదలై, క్రమంగా ప్రాణాంతక వ్యసనంగా మారుతుంది.
పొగాకులోని విషపదార్థాలు రక్తనాళాలను దెబ్బతీసి, గుండెకు రక్తప్రసరణను అడ్డుకుంటాయి.
బీపీ ఉన్న వ్యక్తి పొగ తాగితే గుండెపోటు ప్రమాదం 4 నుండి 8 రెట్లు పెరుగుతుంది.
షుగర్ ఉన్న వ్యక్తి పొగ తాగితే గుండెపోటు ప్రమాదం 6 నుండి 10 రెట్లు పెరుగుతుంది.
ఈ ముగ్గురూ ఏకమైతే? (షుగర్ + బీపీ + ధూమపానం)
ఈ ముగ్గురూ కలిసి గుండెపై దాడి చేస్తే పరిస్థితి ఊహకందని విధంగా మారుతుంది.
మధుమేహం, బీపీ ఉండి ధూమపానం కూడా చేసే వ్యక్తుల్లో గుండెపోటు వచ్చే ముప్పు సాధారణ వ్యక్తులతో పోలిస్తే 15 నుండి 20 రెట్లకు పైగా పెరుగుతుంది!
వైద్యశాస్త్రంలో ఈ ప్రమాదకర కలయికను “ప్రాణాంతక త్రయం” (Lethal Triad) అంటారు.
అందుకే వీరితో రాజీ పడకండి!