నియోజకవర్గంలో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘వన్ మంత్–వన్ కాన్స్టిట్యూయెన్సీ–వన్ వర్డ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ధర్మానగర్ ప్రాంతంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి తో కలిసి ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ పి. విష్ణుకుమార్ రాజు పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే , జాయింట్ కలెక్టర్ ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమకు ఎదురవుతున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని ఓపికగా విని సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ప్రధానంగా పెన్షన్లు, డ్రైనేజీ కాలువలు, పట్టాల సమస్యలు తదితర అంశాలపై ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. ధర్మానగర్‌తో పాటు జోగారావునగర్ ప్రాంతానికి సంబంధించిన పట్టాల సమస్యపై కూడా వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యలపై జాయింట్ కలెక్టర్ , ఎమ్మెల్యే స్పందిస్తూ సంబంధిత అధికారులతో తక్షణమే మాట్లాడి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులను ప్రజల వద్దకే తీసుకువచ్చి సమస్యలను నేరుగా తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ధర్మానగర్ ప్రాంత ప్రజలు తమ సమస్యలను పెద్ద సంఖ్యలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారని, ప్రతి వినతిపత్రాన్ని సంబంధిత శాఖలకు పంపించి వాటిపై తగిన చర్యలు తీసుకునేలా అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పెన్షన్లు, కాలువలు, పట్టాల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి కూడా ప్రజల నుంచి స్వీకరించిన వినతిపత్రాలను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఆర్డీఓ దిలీప్, నోడల్ ఆఫీసర్ రామకృష్ణ, తహసీల్దార్లు రమేష్, ఎంవీవీ ప్రసాద్, పాత్రుడు, జీవీఎంసీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
