స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పానికి టీడీపీ కట్టుబడి ఉందని, న్యాయం జరిగే వరకూ ప్రయత్నం కొనసాగిస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. 34 శాతం రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం సాధ్యమని ఉద్ఘాటించారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతోనే అసెంబ్లీలో జీఓ 105, 1065 జారీ చేస్తే వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. ఎన్నికలు ఆగిపోవాలని, బీసీలకు న్యాయం జరగకూడదని కుట్రతో ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. న్యాయ పరమైన ప్రతి అవకాశాన్ని ఉపయోగించి బీసీలకు అండగా ఉంటామన్నారు. బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యానికి వైసీపీ గండి కొడుతోందని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వని కారణంగా 16,800 మంది అవకాశాలు కోల్పోయారని వివరించారు. అన్ని వర్గాల హక్కులను కాపాడుతూ సీఎం చంద్రబాబు 34 శాతం బీసీ రిజర్వేషన్లకు కృషి చేస్తుంటే గొడ్డలి పార్టీ బీసీలను ఓటు బ్యాంకులా వాడుకుంటోందన్నారు. 1987లో 20 శాతం, 1995 లో 34 శాతం రిజర్వేషన్లతో బీసీలను టీడీపీ గౌరవించుకుందని, బీసీలకు రాజకీయ సాధికారత పార్టీ డి.ఎన్.ఎ.లోనే ఉందని పేర్కొన్నారు.
విశాఖపట్నం
బీసీ రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది: గంటా*