అమలాపురం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా బెండమూరులంక సెంటర్‌లో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా “ముక్త నశా యువ ర్యాలీ” నిర్వహించారు. అల్లవరం ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, బీవీసీ కాలేజ్ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంతో పాటు కుటుంబ, సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పోలీసులు వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. మత్తు రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా “మత్తుకు దూరం – అభివృద్ధికి బాట” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. యువతలో చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.
