డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం మొక్కతోట గ్రామానికి చెందిన పాలపర్తి సుకుమార్ సిబిఎస్సి సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్ ఫర్ సర్వీస్ సంస్థ మానవతా దృక్పథంతో స్పందించింది. వైద్య ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుకుమార్‌కు రూ.1,28,290 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సఖినేటిపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హరికోటి శాస్త్రి చేతుల మీదుగా, గంటా జయరాజు, పాస్టర్ మత్తి ప్రసన్న బాబు, పాస్టర్ పోతుమూడి నవీన్ సమక్షంలో ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ సర్వీస్ సంస్థకు సహాయ సహకారాలు అందిస్తున్న గల్ఫ్ దేశాల్లోని దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాజోలు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సంస్థకు తమవంతు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ, వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్న దాతల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
