రోడ్డు కోసం మూడు గ్రామాల గళం
నలపరెడ్డిపల్లి–మురగళ్ల–కనుపూరుపల్లి రహదారి కోసం ప్రజా సంతకాల ఉద్యమం
ఆత్మకూరు, సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి): నలపరెడ్డిపల్లి–మురగళ్ల–కనుపూరుపల్లి రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతూ మూడు గ్రామాల ప్రజలు ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తోడేటి అశోక్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి మద్దతు సంతకాలు సేకరిస్తున్నారు.శుక్రవారం నలపరెడ్డిపల్లిలో పాంప్లెట్లు పంపిణీ చేసి ప్రజల సంతకాలు తీసుకోగా, శనివారం మురగళ్లలో సంతకాల సేకరణ నిర్వహించారు. కూలీలు, విద్యార్థులు, మహిళలు, రైతులు సహా వివిధ వర్గాల ప్రజలు కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. రహదారి సౌకర్యం లేక నిత్య రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు.
మూడు గ్రామాల నుంచి సేకరించిన సంతకాలతో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి, రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలని కోరనున్నట్లు తోడేటి అశోక్ తెలిపారు. కార్యక్రమంలో పువ్వాడ శ్రీనివాసులు నాయుడు, సుమంత్, హరిబాబు, కళ్యాణ్, తరుణ్, దొడ్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


