కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న కంట కాలనీలో నెలల తరబడి పారిశుధ్య సమస్యలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమై, కంట కాలనీ వంటి ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆరోపిస్తున్నారు.
కాలనీలో డ్రైనేజీల పూడికతీత పనులు చేపట్టకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇంటింటి చెత్త సేకరణ కోసం వచ్చే చెత్త బండి కూడా సక్రమంగా రావడం లేదని స్థానికులు చెబుతున్నారు.
ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడం బాధాకరమని కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు. మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న కాలనీకే ఈ పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వారు అంటున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కంట కాలనీలో డ్రైనేజీల పూడికతీత, చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పట్టణ ప్రగతి కార్యక్రమాలను అన్ని వార్డుల్లో సమానంగా అమలు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.



