జాతీయ స్థాయి ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులను సన్మానించిన సందాని
ఆత్మకూరు, జూన్ 4 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులు భవిష్యత్తులో ఐఐటీల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ కుటుంబాలకు, స్వగ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆత్మకూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, అపోలో క్లినికల్ లేబొరేటరీ అధినేత ఎస్.కె. సందాని ఆకాంక్షించారు.
గురువారం ఆత్మకూరు పట్టణానికి చెందిన భనీష్ కుమార్ రెడ్డి, నిచ్చల్ కుమార్, సోహెల్ అక్తర్, పువ్వాడి బాలాజీ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సందర్భంగా వారి నివాసాలకు వెళ్లి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను శాలువాలతో సన్మానించి, పూల గుచ్ఛాలు అందజేసి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సందాని మాట్లాడుతూ, ఆత్మకూరు పట్టణ చరిత్రలో ఒకేసారి నలుగురు విద్యార్థులు జాతీయ స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు. వారి కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఆరంభంగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి దేశానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని సూచించారు.విద్యార్థులు ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చేరి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అత్యున్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులతో పాటు ఆత్మకూరు పట్టణానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయాలు ఇతర యువతకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సాధిక్ అహ్మద్, జన విజ్ఞాన వేదిక నాయకులు హరికృష్ణ, శ్రెడ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు వాగలహరి తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.





