క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడి
గాజువాక సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆసుపత్రిలో పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆదివారం ఉదయం సుమారు 4:10 గంటల సమయంలో జాతీయ రహదారిపై గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డుపై పంక్చర్ కారణంగా నిలిచివున్న లారీని ఢీకొన్నట్లు కలెక్టర్ వివరించారు. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారని, ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు, రెస్క్యూ బృందాలు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని, మిగిలిన ఏడుగురు క్షతగాత్రులు ప్రమాదం నుంచి బయటపడి స్థిరంగా ఉన్నారని తెలిపారు.
మృతుల కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించామని, బాధితులకు అవసరమైన అన్ని వైద్య, ఇతర సహాయ చర్యలను జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉన్నారని, తునిలో డ్రైవర్ మార్పు జరిగిన తర్వాత వెనుక కూర్చున్న డ్రైవర్ ప్రమాదంలో మృతి చెందగా, బస్సు నడుపుతున్న మరో డ్రైవర్ గాయపడి చికిత్స పొందుతున్నారని, ప్రమాదమేమీ లేదని అన్నారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తామని, వారి కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

