గాజువాక, అక్టోబర్ 25 (పున్నమి ప్రతినిధి):
జీవీఎంసీ 95వ వార్డు స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులి అప్పలరెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచారు. తాను విజయం సాధిస్తే సొంత నిధులతో వార్డులోని ప్రజలకు ‘నవరత్నాలు’ అందించి, అనునిత్యం ప్రజలకు బాసటగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వచ్చే నెల 1న జరగనున్న ఎన్నికల్లో సీరియల్ నంబర్ 11, మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ప్రజల కోసం తొమ్మిది హామీలు
వార్డులోని ప్రతి గ్రామ అభివృద్ధికి రూ.3 లక్షలు కేటాయిస్తామని, వివాహం నిశ్చయమైన ప్రతి వధువుకు పసుపు కుంకుమ కానుకగా రూ.5 వేలు అందిస్తామని అప్పలరెడ్డి ప్రకటించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.10 వేల విద్యా ప్రోత్సాహకాన్ని అందిస్తామని తెలిపారు. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
ఉన్నత విద్యను అభ్యసించి నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్న యువతకు ఏఎంటీజెడ్, ఫార్మా, తయారీ పరిశ్రమలు తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు మార్గదర్శకత్వంతో పాటు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో క్రికెట్, చదరంగం, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వార్డులో ఆడపిల్ల జన్మించిన కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం, ప్రతి ఆలయానికి పది తులాల వెండి ఆభరణాలు అందిస్తామని తెలిపారు. ప్రతి గ్రామ ప్రవేశ ద్వారం వద్ద గ్రామం పేరుతో అందమైన శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ హామీలన్నింటినీ అమలు చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
అభిమానులతో భారీ ర్యాలీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదగంట్యాడ ప్రధాన కూడలి నుంచి పులి అప్పలరెడ్డి తన కుటుంబ సభ్యులు, అభిమానులు, మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య సరితా రెడ్డి, కుమారుడు పులి నిరంజన్ రెడ్డి, కుమార్తె నిష్మా రెడ్డితో పాటు పలువురు మాజీ సైనికులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పిట్ట సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ సైనికులు గొందేశి నాగభూషణం రెడ్డి, మద్ది శంకర్ రెడ్డి, గొందేశి చిరంజీవి రెడ్డి, సీనియర్ పాత్రికేయులు బసా ప్రసాద్ రెడ్డి, గొందేశి వెంకటరమణారెడ్డి, దొమ్మేటి కనకరాజు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజా సేవకు అంకితమై పనిచేస్తానని పేర్కొన్న అప్పలరెడ్డి, వార్డు అభివృద్ధికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.



